మున్సిపాలిటీలలో సింహం గుర్తు జెండా ఎగరవేస్తాం
రెండు మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనే లక్ష్యం
-ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈగం శ్రీనివాస్
జనగామ మరియు స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు జెండాను గట్టిగా ఎగరవేస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జనగామ జిల్లా కన్వీనర్ ఈగం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలలోని అన్ని వార్డులలో ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేకమంది రాజకీయ నాయకులకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన పార్టీ అని గుర్తు చేశారు.ప్రస్తుత పాలకులు,గత పాలకులు జనగామ మరియు స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.ప్రజలను మాయమాటలు,ప్రలోభాలతో మభ్యపెట్టి తమ స్వార్థ ప్రయోజనాలకే పనిచేశారని విమర్శించారు.మున్సిపాలిటీలలో వీధిలైట్లు,పారిశుధ్యం,మురికి కాలువలు,సీసీ రోడ్లు,కుక్కల బెడద,కోతుల బెడద,వైద్య సదుపాయాలు,తాగునీటి సమస్యలు వంటి అనేక సమస్యలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపారు.ఈ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు సరైన చర్యలు చేపట్టలేదన్నారు.మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో,ఆయన శిష్యులుగా ప్రజల ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు.ప్రజలు తమపై నమ్మకం ఉంచి సింహం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.అవకాశం ఇస్తే నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తామని, నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.ఎల్లప్పుడూ ప్రజల కోసం పరితపించే వారిని గుర్తించి ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.