మేడారం మహా జాతర–2026కు పటిష్ట ఏర్పాట్లు
ములుగు జిల్లా ఎస్.ఎస్.తాడ్వాయి మండలంలోని ప్రసిద్ధ మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను శనివారం రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)లు పరిశీలించారు.అనంతరం మేడారం మహా జాతర-2026 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.రోడ్లు,తాగునీరు,పారిశుద్ధ్యం,విద్యుత్,వైద్య సేవలు,తాత్కాలిక వసతి,ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని,భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.అగ్నిమాపక,పోలీస్,రెవెన్యూ,వైద్య,ఆర్అండ్బీ,పంచాయతీ రాజ్ శాఖల మధ్య పూర్తి సమన్వయం అవసరమని స్పష్టం చేశారు.సమీక్ష అనంతరం పాత్రికేయుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ..మేడారం జాతర తెలంగాణ గర్వకారణమని,ఈ మహా పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని వనరులు సమకూర్చుతుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,ఎస్పీ,ఆలయ ఈవో,వివిధ శాఖల ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.