బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపు
మోదీ బహిరంగ సభకు తరలిరండి
బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా,రేపు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపునిచ్చారు.శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.దేశాభివృద్ధిలో తెలంగాణను భాగస్వామ్యం చేయడమే ప్రధాని మోదీ ప్రధాన లక్ష్యమని, ఈ సభ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక దిశానిర్దేశం చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన,అభివృద్ధి పనులకు ఆకర్షితులై తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన వివరించారు.ఈ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని, భూపాలపల్లి జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు,అభిమానులు భారీ ఎత్తున తరలిరావాలని మునేందర్ కోరారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ పటంలో అగ్రగామిగా ఎదుగుతోందని,అటువంటి గొప్ప నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.జిల్లాలోని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులతో పాటు శక్తి కేంద్రాల ఇన్చార్జిలు,బూత్ అధ్యక్షులు తమ పరిధిలోని కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పెద్ద సంఖ్యలో సభకు హాజరై దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని,ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.