
ఈ69 న్యూస్ హన్మకొండ మార్చి 15
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాయిగూడెం గ్రామంలో శ్రీ సరస్వతి మాత టెంపుల్ శివాలయం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇటుక బట్టీ నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ఇటుక బట్టీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇటుకల తయారీ కొనసాగుతున్నట్లు వారు తెలిపారు.ఇటుక తయారీకి అవసరమైన మట్టి, గ్రావెల్‌ను సమీప ప్రాంతాల నుండి అక్రమంగా తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలుగుతోందని, పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా నీటి సరఫరా కోసం విద్యుత్ కనెక్షన్‌ను అక్రమంగా తీసుకుని వినియోగిస్తున్నారని, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా కరెంట్ వైర్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో కార్మికులు మరియు స్థానిక ప్రజలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇటుక బట్టీ వద్ద విద్యుత్ వైర్లు చాలా దూరం వరకు మృత్యుపాశాల్లా వేలాడుతూ ఉండటం గమనార్హమని తెలిపారు.మరోవైపు ఇటుక బట్టీలో మైనర్ బాలికలతో పని చేయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇది బాల కార్మిక చట్టాల ఉల్లంఘనకే దారితీస్తుందని వారు పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించినప్పుడు నిర్వాహకులు తమకు పై అధికారుల అండదండలు ఉన్నాయని దురుసుగా సమాధానం ఇస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై రెవెన్యూ, మైనింగ్, విద్యుత్ మరియు కార్మికశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి అక్రమ ఇటుక బట్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు