రేగొండ గ్రామంలో కొత్త ప్రజాప్రతినిధుల ఎన్నిక
రేగొండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా, శాంతియుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామ అభివృద్ధి–సంక్షేమాల పట్ల ప్రజల్లో ఉన్న ఆశలు, అభిరుచులను ప్రతిబింబిస్తూ ఈసారి ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
తాజాగా వెలువడిన ఫలితాల్లో వారణాశి మౌనిక అజయ్ ఘన విజయం సాధించి రేగొండ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.గ్రామంలో అన్ని వర్గాల ప్రజల మద్దతుతో మౌనిక అజయ్ గెలుపు నమోదైందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మహిళా నాయకత్వానికి ఇది పెద్ద ఊతమని పలువురు అభిప్రాయపడ్డారు.
అదే విధంగా ఉపసర్పంచ్ పదవికి జరిగిన పోటీలో ఎల్దండి నరేష్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ప్రజల అభ్యర్థనలను గుర్తించి సేవ చేయడం తన ప్రధాన లక్ష్యమని నరేష్ అభిప్రాయపడ్డారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్ మౌనిక అజయ్, ఉపసర్పంచ్ నరేష్‌లకు గ్రామ ప్రజలు, సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, స్థానిక రాజకీయవర్గాల వారు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ప్రాథమిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల నిర్మాణం, గ్రామ స్వచ్ఛత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికైన నాయకులు హామీ ఇచ్చారు.
రేగొండ గ్రామపంచాయతీ కొత్త ప్రజాప్రతినిధుల నుండి ప్రజలకు భారీ అంచనాలు ఉండగా, ఈ ఎన్నికల ఫలితాలు గ్రామంలో నూతన అభివృద్ధి దిశగా నడిపిస్తాయని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.