మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
చెక్‌డ్యామ్ ధ్వంసానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి–మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి చిట్యాల
రైతుల సాగునీటి అవసరాలు,మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేలా చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.చిట్యాల మండలం నవాబ్‌పేట గ్రామం మరియు మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామాల మధ్య చలివాగుపై గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌ను కొంతమంది కాంగ్రెస్ నాయకులు బాంబులతో పేల్చివేసిన ప్రదేశాన్ని సోమవారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, ఈ చెక్‌డ్యామ్ ద్వారా గతంలో రెండు పంటలు సులభంగా సాగు చేసుకునే అవకాశం ఉండేదని, అలాగే మత్స్యకారులకు స్థిరమైన ఉపాధి లభించేదని గుర్తు చేశారు.ప్రస్తుతం చెక్‌డ్యామ్ ధ్వంసం కావడంతో విలువైన నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతుండటం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు.నీటిని ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, రాజకీయ దురుద్దేశంతో కొందరు నాయకుల చేత చెక్‌డ్యామ్‌ను కూల్చివేయించడం ప్రజావ్యతిరేక చర్యగా ఆయన విమర్శించారు.ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే దేవాదుల పంపులను ఆన్ చేసి రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.చెక్‌డ్యామ్ కూల్చిన ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, చెక్‌డ్యామ్‌ను వెంటనే పునరుద్ధరించి రైతులకు, మత్స్యకారులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.