రైతుల సమస్యలపై ఈ నెల 11న కలెక్టరేట్ ముట్టడికి సిపిఎం పిలుపు
రైతుల సమస్యలపై ఈ నెల 11న కలెక్టరేట్ ముట్టడికి సిపిఎం పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తీవ్ర అరిగోస పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం పరకాల పట్టణంలో పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.క్షేత్రస్థాయిలో రైతులు పండించిన మొక్కజొన్న,వరి ధాన్యం కల్లాల్లోనే కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయని, కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.ఒకవైపు అకాల వర్షాలు కంటికి కునుకు లేకుండా చేస్తుంటే,సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో రైతు వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని బొట్ల చక్రపాణి ధ్వజమెత్తారు.కల్లాల్లో రైతులు పడిగాపులు కాస్తుంటే,ప్రభుత్వం ఉత్సవాల పేరిట సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా చాలా చోట్ల తూకాలు మొదలు పెట్టలేదని, ప్రారంభించిన చోట రకరకాల కొర్రీలు పెడుతూ కోతలతో రైతులను వేధిస్తున్నారని బొట్ల చక్రపాణి ఆరోపించారు.కంటాలు పూర్తయిన బస్తాలను రైస్ మిల్లులకు తరలించడానికి అవసరమైన లారీలను అందుబాటులో ఉంచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.రైతుల కష్టాలను గాలికొదిలేసి పండుగలు చేయడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా,తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొచ్చు ఈశ్వర్,హేమంత్,కృష్ణ,మడికొండ ప్రశాంత్,సామల రాజు,ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.