రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
సన్న రకాల వరి సాగుతో బోనస్ లబ్ధి పొందాలని రైతాంగానికి పిలుపు రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జయశంకర్ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా విత్తన స్టాళ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన, ధృవీకరించబడిన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకే ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి ధాన్యానికి ప్రత్యేకంగా బోనస్ అందిస్తున్న నేపథ్యంలో, రైతులు ప్రభుత్వం గుర్తించిన సన్న రకాలను సాగు చేసి ఆర్థిక ప్రయోజనం పొందాలని సూచించారు.రేగొండ రైతు వేదిక విత్తన మేళాలో రైతులకు బోనస్ వర్తించే KNM-1638, KNM-7715, RNR-15048, HMT సోనా, జై శ్రీరామ్, WGL-44, BPT-5204 వంటి మేలైన సన్న రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు.రైతు సోదరులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ విత్తన మేళాలోనే విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు.ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తూ.. రైతులు సాంప్రదాయక యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను వినియోగించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా భూ కాలుష్యాన్ని నివారించవచ్చని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తల నివేదికలను ఉటంకిస్తూ రైతులకు అవగాహన కల్పించారు.వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు,సూచనలు అందించాలని ఆదేశించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నడిపల్లి విజన్ రావు, కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (టెంపుల్) చైర్మన్ నాయినేని సంపత్ రావు, రేగొండ సర్పంచ్ వారణాసి మౌనిక అంజి,తిరుమలగిరి సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్, రేగొండ టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వీరితో పాటు పోచంపల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి (డి ఏ ఓ) జే. బాపూ రావు, సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏ డి ఏ) ఎన్. రమేష్, రేగొండ మండల వ్యవసాయ అధికారి (ఏం ఏ ఓ) పెద్ది వాసుదేవరెడ్డి పాల్గొని రైతులకు సాంకేతిక వివరాలు అందించారు. అలాగే మండల వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏ ఈ వోలు) ప్రవీణ్, గోవర్ధన్, నాగరాజు, ప్రవళిక, భరత్,రేగొండ పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతు సోదరులు ఈ విత్తన మేళా ప్రారంభోత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు.