* డిప్యూటీ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు వేయాలి!
- డిప్యూటీ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు వేయాలి!
- యాలం సమ్మయ్య కుటుంబానికి చెందిన భూమిని ఆధారాలు లేకుండానే ఇతరుల పేర్లకు బదిలీ చేశారని ఆరోపణ!
- జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
- – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటి సభ్యుడు & తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ డిమాండ్
తెలుగు గళం వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండల ఎమ్మార్వో కార్యాలయంలో భూ రికార్డుల నిర్వహణలో భారీ అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యుడు, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మార్వోకు బదులుగా డిప్యూటీ తహసీల్దార్ పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతూ, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. వాజేడు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన యాలం సమ్మయ్య (తండ్రి అచ్చయ్య) తన పెదనాన్న యాలం వెంకటయ్య, పెద్దమ్మ యాలం జోగమ్మ పేర్లపై ఉన్న భూమిని చట్టబద్ధంగా తన పేరుపై మార్చుకోవడానికి అవసరమైన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం గత పది నెలలుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు ఉద్దేశపూర్వకంగా సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో యాలం జోగమ్మ పేరుపై ఉన్న పట్టా పాస్‌బుక్‌ను కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి సమ్మతి లేకుండా, సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మార్చడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ అక్రమంపై ప్రశ్నించినా డిప్యూటీ తహసీల్దార్ సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపితే భూ మాఫియా–అధికారుల కుమ్మక్కు బయటపడే అవకాశం ఉందని చింత కృష్ణ ఆరోపించారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి మొత్తం భూ రికార్డులను పరిశీలించాలని, అక్రమంగా పట్టాలు బదిలీ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.