ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ మార్చి 13
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సుమారు రూ.9,300 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఫీజులు చెల్లించకపోవడంతో అనేక కళాశాలలు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల ఉన్నత విద్యాభ్యాసం మరియు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్, జిల్లా నాయకుడు పస్తం పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.