విద్యార్థిని భవిష్యత్తు కోసం తన ఆస్తినే ష్యూరిటీగా పెట్టిన హరీష్ రావు
సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని చదువు పట్ల ఉన్న పట్టుదల, ప్రతిభను గుర్తించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మానవీయతకు మరోసారి నిదర్శనంగా నిలిచారు.సిద్దిపేటలో పుట్టి పెరిగిన ఓ యువతి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి సీటు దక్కించుకుంది.అయితే పీజీ చదువుకు అవసరమైన భారీ ఫీజుల కారణంగా ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.ఆ యువతి తండ్రి టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బ్యాంక్ ద్వారా ఎడ్యుకేషన్ లోన్ లభించే అవకాశం ఉన్నప్పటికీ, అందుకు అవసరమైన భూమి లేదా ఇల్లు వంటి ఆస్తి లేకపోవడంతో లోన్ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న హరీష్ రావు, ఆ విద్యార్థిని ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి ఆమెకు అండగా నిలిచారు.రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌కు తన సొంత సిద్దిపేట ఇంటినే ష్యూరిటీగా పెట్టి బ్యాంక్‌కు హామీ ఇచ్చారు. హరీష్ రావు సహకారంతో బ్యాంక్ అధికారులు స్వయంగా ఆయన వద్దకు వచ్చి అవసరమైన పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. అనంతరం అక్కడికక్కడే లోన్ చెక్కును విద్యార్థినికి అందజేశారు.అదే కాకుండా,వ్యక్తిగతంగా మరో రూ.1 లక్ష ఆర్థిక సహాయం కూడా అందించి, ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విద్యార్థిని కుటుంబాన్ని తన నివాసానికి ఆహ్వానించి భోజనం ఏర్పాటు చేసి,”బాగా చదివి సమాజంలో పేదలకు సేవ చేసే స్థాయికి ఎదగాలి” అంటూ ఆశీర్వదించారు.ఈ సంఘటన సిద్దిపేట ప్రజలతో హరీష్ రావుకు ఉన్న అనుబంధాన్ని మరోసారి స్పష్టంగా చూపించింది. ప్రజల కష్టాల్లో తాను భాగస్వామిగా ఉండడమే కారణంగా ఏ ఎన్నిక వచ్చినా సిద్దిపేట నుంచి ఆయనకు 70 శాతం పైగా ఓట్లు వస్తున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా మానవీయతతో ముందుకు వచ్చిన హరీష్ రావు చర్యపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి