
సమస్యల పరిష్కారం కోరుతూ మార్కెట్ కార్యదర్శి జి.జీవన్ కుమార్ కు వినతిపత్రం.
జనగామ వ్యవసాయ గ్రేన్ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కార్యదర్శి జి.జీవన్ కుమార్ కు శనివారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ..రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పప్పుదినుసులు,వరి ధాన్యం వంటి పంటలను మార్కెట్కు తెస్తున్నప్పటికీ,మద్దతు ధర కు సరైన రీతిలో కొనుగోలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే 2025-26 మద్దతు ధరలకు వ్యాపారులు తప్పనిసరిగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని,ప్రతి పంటను ఈ-నామ్ ద్వారా కొనుగోలు చేయాలని,వ్యాపారస్తుల సిండికేట్ వ్యవహారాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.మార్కెట్లో జీరో దందా వ్యాపారం పూర్తిగా అరికట్టాలని,మార్కెట్ సెస్ ఎగవేతను నివారించాలని,రైతుల సౌకర్యార్థం అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య,పట్టణ కార్యదర్శి మంగ భీరయ్య,నాయకులు నక్క యాకయ్య తదితరులు పాల్గొన్నారు.