సామాజిక విప్లవ మూర్తి సావిత్రిబాయి పూలే
సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాలలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు.ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా “సావిత్రిబాయి జీవితం-ఆమె ఆశయ సాధన,మహిళల హక్కులు”అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది.ఈ సెమినార్కు ముఖ్య వక్తగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు వేల ఏండ్లుగా మనుస్మృతి వంటి మానసిక విషచట్టాల కారణంగా మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా అణచివేతకు గురయ్యారని అన్నారు.అలాంటి చీకటి సమాజంలో ఎన్నో అవమానాలు,కష్టాలు భరిస్తూ నాగరిక సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.మనుషులందరూ సమానులేనని చాటేందుకు తన జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి,శూద్రులు,మహిళలు,నిమ్న జాతుల ప్రజలకు విద్య అనే శక్తివంతమైన ఆయుధాన్ని అందించారని తెలిపారు.నాటి అంధకార సమాజానికి వెలుగు దివిటిగా నిలిచిన వీరవనిత,సామాజిక విప్లవ మాతృమూర్తి,చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు.సావిత్రిబాయి పూలే చేసిన మహోన్నత కృషిని మరుగున పడేసేందుకు ప్రయత్నిస్తున్న మనువాదపు కుతంత్రాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అరుణ జ్యోతి అన్నారు.వేల ఏండ్లుగా మహిళలు చదువుకోకూడదు,వినకూడదని విధించిన కఠిన నిబంధనల వల్ల సమాజంలోని 90 శాతం మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.సావిత్రిబాయి పూలే ఆశయాలను నిజంగా అమలు చేయాలంటే పాలకులు అందరికీ సమాన విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆమె కలలుగన్న సామాజిక విప్లవాత్మక మార్పులు నేటికీ పూర్తిగా నెరవేరలేదని,సావిత్రిబాయి చూపిన మార్గం నేటి సామాజికవాదులకు ఒక గొప్ప సవాలుగా మిగిలిందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్,మాజీ కౌన్సిలర్ కందూరి రేణుక,ఐద్వా నాయకులు భవ్య,శ్రీ,శ్యామల,సుజాత,సావిత్రి,సరోజన,అలేఖ్య,హైమది బేగం,కళావతి,ఎల్లవా,మమత,లావణ్య,నీరజ,సుజాత,ఇందిరా,రమణ,దీవెన,శివ రాజవ్వ,జ్యోతి,నరసవ్వ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.