సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ సిఐటియు నిరసన
ట్రాఫిక్ చలాన్ వేసిన వెంటనే ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ,సిఐటియు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం,ఏజీ కాలనీ డివిజన్ పరిధిలోని జవహర్నగర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాపర్తి అశోక్,ఎండి అషీఫ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, ప్రజల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులను సైబర్ నేరాల తరహాలో బలవంతంగా కట్ చేసే విధానాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు.ఇలాంటి ప్రజావ్యతిరేక వ్యాఖ్యలను ముఖ్యమంత్రి తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రవాణా రంగ సంక్షేమ బోర్డు వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఆటో కార్మికులకు ఇస్తామని ప్రకటించిన రూ.12,000 ఆర్థిక సహాయం ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.చలాన్ వేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.హైదరాబాద్ నగరంలో యూటర్న్ల సమస్య ప్రజలకు తీవ్రమైన ఇబ్బందిగా మారిందని, రెండు నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్ తీసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్లు సరిగా లేకపోవడం,ట్రాఫిక్ జామ్ల కారణంగా ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ సమస్యలపై ప్రజలు,రవాణా రంగ కార్మికులు ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పరుకు,రహీం,మహేష్,హైమాద్ తదితరులు పాల్గొన్నారు