అంతులేని శ్రమ దోపిడీకి గురవుతున్న తెలంగాణ కార్మిక వర్గం
నయా ఉదారవాద విధానాల అమలు విశృంఖలంగా కొనసాగుతున్నది. 1991 ప్రారంభంలో ఎగుమతులు, దిగుమతులు సడలింపు, లైసన్స్ విధానంలో మార్పులతో మొదలై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు చేరింది. నేదు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం నిత్యకృత్యం అయింది. అయినా పెట్టుబడి దారి వర్గం సంపద పోగువేసుకుంటూనే ఉంది. దాని ధనదాహం తీరడం లేదు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ రద్దు చేయించింది. శ్రమను దోచుకోవడం కోసం వాళ్ళ పారిశ్రామిక విప్లవం తొలినాళ్ళ పని పద్ధతులు ఉండాలని కోరుకుంటున్నది. అందుకు తక్కువ వేతనం ఎక్కువ పనిగంటలు దిమాందు చేస్తున్నది. ఈనేపథ్యంలో బిజెపి నరేంద్రమోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లలో పని గంటలు పెంచింది. రాష్ట్రాలకూ లెక్కలు ఉండడంతో మన ప్రభుత్వం 10గం.ల పనిదినం అన్ని రంగాలలో ప్రవేశపెట్టబోతున్నది.
మరో ప్రక్క రాజ్యమే శ్రమదోపిదనీ తీవ్రం చేసింది. గతంలో టిఆర్ఎస్ పాలనలో చూసాం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో ఉంది. కనీస వేతనాల నిర్ణయంలో జాప్యం, కాంట్రాక్టులు ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్ల పేరిట విపరీతమైన శ్రమ దోపిడీ, తక్కువ వేతనాలతో ప్రభుత్వం ప్రవేట్ రంగం విపరీతంగా లాభపడుతున్నది. ప్రభుత్వ అండదండలతో సాగుతున్న వేతన దోపిడీని పరిశీలిద్దాం.
రాష్ట్రంలో ఒక కోటి 20 లక్షల మంది 76 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ పరిధిలో ఉన్నారు. వీరికి కనీస వేతన చట్టం 1948 ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి. 2006-2012 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సవరించారు. 15 సంవత్సరాలుగా కార్మికుల వేతనాలు పెంచకపోవడం వల్ల యాజమాన్యాలకు ప్రభుత్వమే వేలకోట్ల మిగిలే విధంగా చేసి కార్మికుల శ్రమ దోపిడీకి గురి చేసింది. పెరిగిన ధరల నేపథ్యంలో కనీస వేతనం రూ.26,000లు నిర్ణయించకుండా కార్మికులను అర్ధాకలతో మార్చి వేస్తున్నది. 2021 లో ఇచ్చిన 5 జి.ఓ.ల ప్రకారం కనీస వేతనం 18,019 రూపాయలు అమలు చేయాలని హైకోర్టు చెప్పినా యాజమాన్య సంఘాల ఒత్తిడితో లొంగి కార్మికులకు అన్యాయం చేసింది.
రాష్ట్రంలో భౌగోళిక పరిశ్రమలు వాతావరణం మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ రాయితీలవల్ల వేగంగా పెట్టుబడులు ఆకర్షణ ఉన్నది. రాష్ట్రంలో హైదరాబాద్ దాని చుట్టూ ప్రాంతాల అభివృద్ధి పరిశ్రమల విస్తరణతో పాటు సింగరేణి బొగ్గు గనులు సూర్యాపేట, నల్లగొండ, పెద్దపల్లి, తాందూరు మొదలైనటువంటి సిమెంట్ పరిశ్రమలు, పవర్ ప్రాజెక్ట్, కాగితపు పరిశ్రమలు, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ మరియు ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ సెక్టార్ భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి బహుళ జాతి కంపెనీల విస్తరణ జరిగింది. విస్తరణ వల్ల భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇందులో కాంట్రాక్ట్ కార్మికులు, వలస కార్మికులు 90 శాతం ఉన్నారు. 12 గంటల పని రూ.12000 వేతనం ఇతర సౌకర్యాలు లేవు శ్రమ దోపిడీ తీవ్రమైంది కార్మికుల చట్టాలు అమలు లేదు. పెట్టుబడిదారీ వర్గానికి విపరీతంగా సంపద పోగు చేసుకుంటున్నాయి. రాష్ట్ర స్థూల ఆదాయం రూ.16 లక్షల కోట్లకు పైగా చేరింది. తలసరి ఆదాయం రూ.3,79,751 గా ఉంది. దేశ తలసరి ఆదాయం కన్నా లక్ష రూపాయలు ఎక్కువే. కానీ ఎవరి ఆదాయం పెరిగింది, ఎవరి ఆదాయం తగ్గింది, పరిశీలిస్తే కోటి మంది పైగా ఉన్న షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల జీతాలు తగ్గాయి. 15 లక్షల మంది ప్రభుత్వ పరిధిలో పనిచేసే వారి జీతభత్యాలు తగ్గాయి. ఫలితంగా కార్పోరేట్ల ఆస్తులు ప్రభుత్వ కాంట్రాక్టర్ల ఆదాయం పెరిగింది.
కొన్ని కీలక రంగాలలో ఉద్యోగుల శ్రమ ఎలా దోపిడీకి గురవుతున్నదో చూద్దాం!
సింగరేణి సంస్థలో 40 వేల మంది పర్మినెంట్, 26,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. సింగరేణి లాభాల్లో ఉంది. సంస్థకు బొగ్గు కరెంటు ఇతరాలు ప్రభుత్వమే 48 వేలకోట్లు చెల్లించవలసి వచ్చింది. కొత్త బావులు త్రవ్వడం లేదు. బొగ్గు బావుల కోసం రాష్ట్రం పోరాటం లేదు. ఇద్దరూ 10 సంవత్సరాల్లో రూ.78000 కోట్లు పన్నుల రూపంలో తీసుకుని సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించడం లేదు. కార్మికులకు న్యాయంగా రావాల్సిన జీతభత్యాలు చెల్లించడం లేదు పర్మినెంట్ వర్కర్స్ కు పెర్ట్జ్ పై ఇన్కమ్ టాక్స్ రియంబర్స్మెంట్ చేయడం లేదు. కాంట్రాక్ట్ వర్కర్లు 26,000 మంది శ్రమ దోపిడీకి తీవ్రంగా గురవుతున్నారు. కోల్ ఇండియా హైపవర్ కమిటీ నిర్ణయించిన ప్రకారం రూ. 1285 లు ఇవ్వాలి. ఈ లెక్కన సంవత్సరానికి రూ. 24 కోట్లు ఒక కార్మికుడు నష్టపోతున్నాడు ప్రతినెల రెండు కోట్లు సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు కార్మికులు నష్టపోయి సింగరేణి లాభపడుతుంది ఇది ప్రభుత్వ ప్రత్యక్ష దోపిడీ. మరో ముఖ్యమైన సంస్థ ఆర్టీసీ ఇందులో 44,000 మంది ఉన్నారు 20017లో వీరికి వేతనాల బకాయిలు యివ్వాల్సి ఉ ంది. 2021, 2025లో వేతనాలు సవరించాలి కానీ నేటికీ ఆ పని చేయలేదు. ప్రతీ కార్మికుడు అన్ని లెక్కలేస్తే పది లక్షల చొప్పున రావాలి సుమారు 4వేల కోట్ల బకాయిలు పడింది.
కేంద్ర ప్రభుత్వ శాఖలలో పర్మినెంట్ పెన్షన్స్ కాంట్రాక్టు ఔట్‌సోర్సు స్కీమ్ వర్కర్ల పేరిట 15 లక్షలకు పైగా ఉన్నారు. వీరందరికీ 2023 జూలైలో వేతనాలు పెంచాల్సి ఉంది. రెండు సంవత్సరాలు గడిచిన వేతన సవరణ చేయకపోవటంతో వందల కోట్లు నష్టపోతున్నారు. ప్రతినెల సుమారు 900 మంది రిటైర్ అవుతున్నారు వీరికి ఇప్పటివరకు సుమారు 12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. అన్నింటిలో అనేక బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. రూ.17,500 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సమానపని సమాన వేతనం ఇప్పటికీ వెట్టి చాకిరి చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 15,600 నుండి 19500 ఔట్సోర్సింగ్ కార్మికులకు రూ. 9,000 నుండి రూ.12,000 స్కీం వర్కర్లకు అంగన్వాడీలకు రూ.13,500, ఆయాలకు రూ.7000, మధ్యాహ్న భోజనం వారికి రూ.3000, ఐకెపి ఉద్యోగులకు రూ.5000, ఆశాలకు రూ.9750 పారితోషికాలు ఫీల్డ్ అసిస్టెంట్స్‌కు రూ.10000 మాత్రమే చెల్లిస్తూ విపరీతమైన శ్రమ చేయించుకుంటున్నారు పర్మినెంట్ వర్కర్స్‌తో సమానంగా పనిచేసిన కూడా వీరికి మాత్రం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదు. పర్మినెంట్ చేయడం లేదు గ్రాట్యూటీ కూడా చెల్లించకుండా అన్యాయం చేస్తున్నది ఈ రూపంలో ప్రభుత్వమే వేల కోట్లు మిగులుచుకుంటుంది.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వెలుగులు ఇచ్చే కరెంటు ఉద్యోగుల పరిస్థితి శ్రమ దోపిడీ తీవ్రంగా ఉంది. వీరిలో ఆర్టిజన్స్ సుమారు 19567 మంది ఉన్నారు. నాలుగు గైడ్స్ లోని వీరికి రూ.23,000 నుండి 52,000 వరకు ఉంది. ఇదే పని చేసే పర్మినెంట్ ఎంప్లాయిస్ రూ.1.25 లక్షల జీతం ఉంటుంది. ప్రతి ఆర్టిజన్ నెలకు లక్ష సంవత్సరానికి 12 లక్షల నష్టపోతున్నాడు. ఈ లెక్కన పంతొమ్మిది వేల మందికి లెక్కిస్తే సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల శ్రమదోపిడి గురవుతున్నారో పరిశీలించుకోవచ్చును అందుకే వీరు సర్వీస్ రెగ్యులరైజేషన్ డిమాండ్ చేస్తున్నారు.
ఒకటి 1.40 లక్షల మంది స్థానిక సంస్థలలోని గ్రామపంచాయతీ, మున్సిపల్ ఉద్యోగులకు రూ.9500 నుండి రూ.16,000 వరకు వేతనమిస్తున్నారు వీరందరూ కనీస వేతనం రూ.26,000 ప్రకారం చెల్లించకపోవడంతో చాలా నష్టపోతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టార్లో ట్రాన్స్పోర్ట్ రంగం, భవన నిర్మాణ రంగం విస్తరిస్తుంది. రెండు రంగాలలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు వీరికి కనీస వేతనాలు లేవు ఎనిమిది గంటల పని దినము లేదు యాజమాన్య దోపిడీ విపరీతంగా ఉంది. ఇటీవల గిగ్ వర్కర్స్, ఫ్లాట్ ఫామ్ వర్కర్స్‌లో ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గి లాంటి వాటిలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. వారికి చట్టం తీసుకువచ్చామని చెబుతున్నా న్యాయం జరగటం లేదు.
మొత్తంగా తెలంగాణ కార్మిక వర్గం పరిశ్రమల దోపిడీకి గురవుతున్నది యాజమాన్యాల లాభాలు పెరుగుతున్నాయి. దేశంలోనే 100 మందిలో తెలంగాణ వాళ్లే 10 మంది బిలియనీర్లు సంపద రెండు లక్షల కోట్లకు పెరిగింది. మిలియనీర్ల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల శ్రమను దోచుకుని ఎవరూ లాభపడింది స్పష్టంగా అర్థం అవుతున్నది మరో ప్రక్క రోజు కూలి రూ.300 నుండి రూ.500లతో కార్మికుల బతుకులీడుస్తున్నారు. అందుకు కార్మిక వర్గాల్లో అశాంతి పెరిగి పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో పారిశ్రామిక కార్మికుల సంఘం పోరాటాలు ఎన్నో జరిగాయి. దేశవ్యాప్త సంబంధాల్లో భాగంగా లక్షల మంది రోడ్లు మీదికి వస్తున్నారు. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికులు సమ్మెలు జరిగాయి. కాంట్రాక్టు ఉద్యోగుల కార్మికులు కూడా ఇదే బాట పడుతున్నారు. టిఆర్ఎస్ విధానాలు నచ్చక ఓడించారు. కాంగ్రెస్ వల్ల ప్రయోజనం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాల్లోని నేషనల్ మోనిటైజేషన్ పైడ్లైన్ భాగంగా రైల్వేలు, రోడ్లు, ఇన్సూరెన్సు, గోదాములు, టెలికం ఆస్తులు కూడా ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారు.
మరోవైపు కేంద్ర బిజెపి విధానాలు లేబర్ కోడ్లకు నిరసనగా సమ్మెలు, నిరసనలు తెలంగాణ రాష్ట్రంలో ఉదృతంగా జరిగాయి రాబోయే కాలమంతా పోరాట కాలమే ప్రభుత్వాలు ఇప్పటికైశ్రీవ కళ్ళు తెరిచి కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే రాజకీయంగా పతనం కాక తప్పదు.
భూపాల్ సిఐటియు ఉపాధ్యక్షులు