ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ముప్పారంలో మట్టి దోపిడీ-గ్రామస్తుల ఆగ్రహం ఈ69న్యూస్ హనుమకొండ:-ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ చెరువులో అక్రమ మట్టి దందా వెలుగు చూస్తోంది.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మట్టి తీసుకుంటున్నామని చెప్పి,కొంతమంది వ్యక్తులు చెరువులో నుంచి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ,వాణిజ్య లాభాలు పొందుతున్నారు.స్థానికుల సమాచారం ప్రకారం,ఒక ట్రాక్టర్ మట్టికి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక సరోవర తవ్వుతున్నామని చూపిస్తూ,కొందరు అధికారులు అనుమతులు ఇచ్చారని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.ఇందిరమ్మ ఇండ్లకు మట్టి తీసుకుంటే తప్పేంటి? అని ప్రశ్నిస్తూ,వాస్తవిక లబ్ధిదారుల అవసరాలను పక్కనపెట్టి,పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు.ఇది పూర్తిగా అక్రమమని,ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని గ్రామస్తులు అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే,ప్రజలు స్వయంగా పోరాటానికి దిగుతారని హెచ్చరిస్తున్నారు.మట్టి తరలింపునకు అనుమతులు ఎలా వచ్చాయో విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.