అథ్లెటిక్స్ పోటీలకు శివునిపల్లి విద్యార్థిని ఎంపిక
స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ శివునిపల్లి పాఠశాల విద్యార్థిని గుర్రం అవంతి (6వ తరగతి) రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.ఈ నెల 8వ తేదీన జనగామలోని ధర్మకంచ మినీ స్టేడియం క్రీడా మైదానంలో నిర్వహించిన జనగామ జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో అవంతి తన క్రీడా ప్రతిభ,నైపుణ్యంతో ప్రతిభ చూపి తెలంగాణ 11వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసుమ రమేష్ తెలిపారు.ఈ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 18 నుంచి 20 వరకు ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కొండ రవి వెల్లడించారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిని పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాధిక, పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షులు జొన్నల రాజేశ్వర్,యంజాల ప్రభాకర్,ఎం.డి.దస్తగిరి,నాగబండి వెంకట్ రామ్ నరసయ్య, క్రీడా పోషకులు గోలి రాజశేఖర్,పాలకుర్తి సోమశేఖర్ తదితరులు అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రస్థాయిలో మంచి ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని,పాఠశాలకే కాక గ్రామానికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ విజయంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం,గ్రామ పెద్దలు విద్యార్థినిని హృదయపూర్వకంగా అభినందించారు.