అమెరికా నిర్భంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు కార్మికవర్గం అండగా నిలవాలి.
Uncategorizedకేంద్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబు
గత 60 ఏండ్లుగా అమెరికా దాష్టికాన్ని ఎదిరించి నిలబడుతున్న క్యూబాపై ఆంక్షలు విధించడం ద్వారా క్యూబా ప్రజల స్ఫూర్తిని దెబ్బతీయాలని అమెరికన్ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికన్ సామ్రాజ్యవాద ఆంక్షలకు వ్యతిరేకంగా క్యూబా ప్రజలు పోరాడుతూనే తమ దేశాన్ని ముందుకు తీసుకొనిపోతున్నారని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు కార్మిక వర్గం అండగా నిలబడాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటి సభ్యులు ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. జులై 23 నుండి 15 వరకు జరిగే ట్రేడ్ యూనియన్ రంగంలో పార్టీ నాయకత్వ శిక్షణ తరగతులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన 31 తీర్మానాలను అమెరికా తిరస్కరించింది. క్యూబా వ్యతిరేక శక్తులకు, టెర్రరిస్టులకు మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తూ క్యూబాను అస్థిరపర్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. వీటికి అదనంగా ‘‘దొంగే దొంగ`దొంగ’’ అని అరిచినట్లు క్యూబాపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ముద్ర వేసి, ఆంక్షలను మరింత పెంచి క్యూబాను లొంగదీసుకోవాలని చూస్తున్నదని, సామ్రాజ్యవాద అమెరికా విధిస్తున్న దిగ్భంధనం వల్ల విద్యుత్ ఉత్పత్తిలో, పంపిణీలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లేకుండానే చీకటిలోనే మగ్గుతున్నారని, విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు నడపగలిగే పరిస్థితి లేనందున, ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో ఉన్నది. మరోవైపు మందుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొరత వల్ల అవసరమైన మందుల ఉత్పత్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడ్తున్నది. ఆహారం, ఇంధనం, ముడి సరుకులు తదితర అనేకం క్యూబాకు అందకుండా ఆర్ధిక దిగ్భంధనాన్ని విధిస్తున్నారు. అంతేకాక క్యూబాపై వ్యాపార ఆంక్షలు, ట్రావెల్ ఆంక్షలు, ఆర్ధిక ఆంక్షలు, పెట్టుబడుల ఆంక్షలు విధించి ఇతర దేశాల నుండి సహాయం పొందేందుకు కూడా వీలులేని పరిస్థితిని అమెరికా సృష్టించడం దుర్మార్గమన్నారు.
65 సం॥లుగా అమెరికన్ సామ్రాజ్యవాద ఆంక్షలను తట్టుకుంటూనే క్యూబా అనేక విజయాలు సాధిస్తున్నదని, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటామని, సామ్రాజ్యవాదానికి తలొంచేది లేదని క్యూబా ప్రజలు ధృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా లేదా కోవిడ్ లాంటి మహమ్మారి రోగాలు వచ్చినా అక్కడ క్యూబన్ డాక్టర్లు, నర్సులను పంపి తన అంతర్జాతీయతను, ప్రజల పట్ల సోషలిస్టు దేశానికి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నది. ఎన్ని నిర్భంధాలు, ఆంక్షలు విధించినా ఒక సోషలిస్టు దేశంగా తమ అంతర్జాతీయతత్వాన్ని వదులుకోబోమని నిరంతరం ప్రపంచ ప్రజల ముందు రుజువు చేస్తూనే ఉన్నదని తెలిపారు. కార్మికవర్గం ఎప్పుడూ అంతర్జాతీయతత్వంతో ఉంటుందని, అందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులు కలిసి క్యూబాపై అమెరికన్ సామ్రాజ్యవాదం విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా గొంతెత్తడమే కాకుండా, ప్రతి రంగంలోని ప్రతి కార్మికుడు కూడా క్యూబాకు ఆర్ధికంగా సంఫీుభావ నిధిని అందించడం మన కర్తవ్యంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్, భూపాల్, ఆర్.సుధాభాస్కర్, ఎస్వీ రమ, పి.జయలక్ష్మీ, కళ్యాణం వెంకటేశ్వర్లు, పుట్టా అంజనేయులు, నూర్జాహాన్, టియు ఫ్రాక్షన్ కమిటీలు కూడా పాల్గొన్నారు.