అరోరా పీజీ కళాశాలల్లో స్నాతకోత్సవం
సాంకేతిక పరిజ్ఞానం, మానవ విలువలు రెండింటినీ సమానంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కష్టపడి సాధన చేస్తే కార్యసాధన సులభమని చెప్పారు. భవిష్యత్తు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సమాజానికి సేవ చేయాలని విద్యార్థులను అతిథులు తమ మాటలతో ప్రేరేపించారు. రామంతాపూర్‌లోని అరోరా పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ‘సమారోహ్–2025’ స్నాతకోత్సవం బాగ్‌లింగంపల్లి ఆర్టిసి కళాభవన్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరామ్ అధ్యక్షత వహించారు. ప్రధాన అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (న్యూఢిల్లీ) డీన్ అకడమిక్ అండ్ రీసెర్చ్ ప్రొ. కుమార్ సురేష్, డిస్టింగ్విష్డ్ గెస్ట్‌గా ఐఐఎం కోజికోడ్ ప్రొ. శ్రీధర్ గూడ, ఎమినెంట్ గెస్ట్‌గా నోవార్టిస్ ఇండియా డైరెక్టర్ శ్రీ తేజ్‌కుమార్ వంగవేటి, ప్రత్యేక అతిథిగా పీజియో సీఈఓ కె. హరి కృష్ణ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రసంగం కోసం ప్రవచన కిరీటీ డా. గరికపాటి నరసింహరావు విచ్చేసి మంగళాశీస్సులు అందించారు.సమారోహంలో అరోరా గ్రూప్ చైర్మన్ నిమ్మటూరి అనుదీప్, సెక్రటరీ డా. నిమ్మటూరి రమేష్‌బాబు, డైరెక్టర్ డా. ఎం. మాధవి, విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 7 బంగారు పతకాలు, 40 ప్రతిభా పట్టాలు, 920 డిగ్రీ సర్టిఫికట్లు ప్రదానం చేశారు.ఎంసిఏ విభాగంలో అంకిత ముదేటి, ధనుష్ తొడిచెట్టి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకులు సాధించగా, ఎంబిఏలో కంటల సాహితి, సకిలం రక్షిత ప్రథమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు.