అవసరాలకు నాణ్యత లేని విత్తనాల సరఫరా
కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 11న ‘‘విత్తన బిల్లు 2005’’ ముసాయిదాను తెచ్చింది. దీనిపై డిసెంబర్ 11 వరకు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాల్సిందిగా కోరుతూ ప్రజా సమూహాంలోకి ఈ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు అనేక మంది సమావేశం జరిపి బిల్లు ముసాయిదాను చర్చించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి క్రింది చర్యలు తీసుకోవాలి. చట్టం అమలుకు ఎవరు బాధ్యత వహించాలి? భారత రాజ్యాంగం రీత్యా విత్తన చట్టం రాష్ట్రాల పరిధిలోనిది. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాన్ని రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత కలిగిఉన్నాయి. అలాగే, విత్తన ధరలను నిర్ణయించే బాధ్యత కూడా రాష్ట్రాలకే ఉండాలి. రాష్ట్రాలలోని యూనివర్సిటీలు, ఇతర పరిశోధన సంస్థలు కొత్త విత్తనాలను రూపొందించి, అనువైనవాటిని రాష్ట్ర విత్తన కమిటీ అంగీకారంతో రాష్ట్ర రైతుల సాగుకు నేరుగా విడుదల చేయాలి. ఇలా విడుదల చేసే విత్తన రకాలకు ఒక బ్రాండ్ పేరుతో, మొలకశాతం (జర్మినేషన్ రేట్), గరిష్ట అమ్మకంధర (ఎం.ఆర్.పి), గరిష్ట వాడకం గడువు (ఎక్స్పైరీ డేట్) ప్రతి ప్యాకెట్ మీద తెలపాలి. ఇటువంటి విత్తనాలు రైతులకు నష్టం కలిగించినప్పుడు, విత్తన కంపెనీ అట్టి రైతులకు పరిహారం చెల్లించాలి. రాజ్యాంగం రీత్యా, పై అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. రాష్ట్ర విత్తన కమిటీతో పాటు అవసరమైన సబ్ కమిటీలను సంబంధిత నిపుణులతో ఏర్పాటు చేయాలి. ఈ అంశాలతో కూడిన సమగ్ర విత్తన చట్టం ఉండే విధంగా విత్తన బిల్లు ముసాయిదాను సవరించాలి. విత్తన చట్టాల చరిత్ర : దేశంలో 1964 నుండి 1984 వరకు హరిత విప్లవం పేరుతో వ్యవసాయ ఉత్పాదకతను, ఉత్పత్తిని పెంచడానికి నాటి ప్రభుత్వం ‘‘విత్తన చట్టం 1966’’, విత్తన కంట్రోల్ ఆదేశాల చట్టం, 1983లో తెచ్చింది. ఈ రెండు చట్టాల ఆధారంగా ఇంతకాలం విత్తనోత్పత్తి, దిగుమతి, సరఫరా జరుగుతున్నది.
1990లో దేశీయ విత్తనోత్పత్తి పెరిగి మన అవసరాలకే కాక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. విత్తనాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు విత్తన చట్టం తేవాల్సిన అవసరం ఏర్పడిరది. విత్తనోత్పత్తి చేసే రైతులకు కంపెనీల నుండి రక్షణ కల్పించడానికి, వాణిజ్యపరంగా వ్యవసాయోత్పత్తులు చేసే రైతులకు రక్షణ కల్పించడానికి చట్టాలు చేయవల్సిన పరిస్థితి ముందుకు వచ్చింది. ఇప్పటికే టాటా, బిర్లా, ఐటిసి, రిలయన్స్ లాంటి కంపెనీలు విత్తనరంగంలోకి వచ్చి గుత్తాధిపత్యం సంపాదించాయి. 2000ల సంవత్సరంలో అమెరికన్ కంపెనీ మోన్శాంటో, జర్మనీ కంపెనీ డూపాంట్, కార్గిల్, సింజంటా లాంటి గుత్త కంపెనీలు విత్తనోత్పత్తిలోకి ప్రవేశించాయి. ఆ పరిస్థితులలో, రైతుల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తేవడానికి ప్రయత్నించింది. 2004లో చేసిన విత్తన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దానిని ఆమోదించకుండానే ఆ బిల్లుకు 2010లో సవరణలను ప్రతిపాదించింది. అయినా, దానికి పార్లమెంట్ ఆమోదం లభించలేదు. తిరిగి 2019లో మరో ముసాయిదా బిల్లును కేంద్రం తెచ్చింది. కార్పొరేట్ల ఒత్తిడితో దానిని కూడా పెండిరగ్లో పెట్టింది. చివరకు, తెలంగాణ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఒక సమగ్ర బిల్లును రూపొందించింది. శాసన సభలో ప్రవేశ పెట్టిన రోజే కేంద్రం నుండి వచ్చిన లేఖతో శాసన సభ నుండి ఆ బిల్లును ఉపసంహరించుకుంది. ఈ విధంగా విత్తన చట్టం కోసం అనేక ప్రయత్నాలను చేస్తున్నప్పటికీ గత 2 దశాబ్దాలుగా కార్పొరేట్ల ఒత్తిడితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టం చేయకుండా పెండిరగ్లో పెట్టాయి. ఫలితంగా, విత్తనోత్పత్తి రైతులు, వాణిజ్య పరంగా పంటల్ని పండిస్తున్న రైతులు అనేక నష్టాలకు లోనయ్యారు. నాణ్యతలేని విత్తనాలు, అత్యధిక ధరల నిర్ణయం వలన రైతులు యేటా లక్షల ఎకరాల్లో నష్టపోయారు. అదే సందర్భంలో, మన దేశం నుండి ఎగుమతి చేయడానికి ఎఫ్1 హైబ్రిడ్ విత్తనాలు, సర్టిఫైడ్ విత్తనాలు, నాణ్యమైనవి ఇతర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నవి. దేశీయ అవసరాలకు నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖలు కార్పొరేట్ సంస్థల కనుసన్నలలో పనిచేస్తున్నాయి. ఫలితంగా, రైతులు ఉత్పాధకతను నష్టపోతున్నారు. డిల్లీలో 2020లో 11 మాసాలు రైతాంగం చేసిన పోరాటాల ఫలితంగా, విత్తన చట్టం తేవడానికి కేంద్రం అంగీకరించింది. కానీ, రైతు సంఘాల సూచనలు తీసుకోకుండానే ఏకపక్షంగా ఇప్పుడు ‘‘విత్తన బిల్లు 2025’’ ముసాయిదాను ప్రకటించి, సలహాలను, అభ్యంతరాలను కోరింది. ముసాయిదా విత్తన బిల్లులో ఏముంది? ఈ చట్టం ప్రధానంగా జి7 దేశాల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది. స్థానిక ఉత్పత్తుల కన్న దిగుమతులపై ఆంక్షల తొలగింపు, నియంత్రణల రద్దు ముసాయిదాలో ప్రదాన అంశంగా ఉన్నట్లు కనిపిస్తుంది. జన్యుమార్పిడి పంటలను ప్రోత్సహించడానికి ఈ చట్టంలో అవకాశం కల్పించబడిరది. గతంలో వంకాయ, కూరగాయలలో జన్యుమార్పిడి సాంకేతికాన్ని ప్రవేశపెట్టడాన్ని భారత రైతులు తీవ్రంగా వ్యతిరేకించి, ఉధ్యమించి విరమింప చేశారు. ఈ ముసాయిదా బిల్లులో క్లాజ్2 (జెడ్ జే)లో వెరైటి (రకం) నిర్వచనం ద్వారా జన్యుమార్పిడి విత్తనాలకు అవకాశం కల్పించబడిరది. జన్యుమార్పిడి ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి సురక్షితమైనవని ఇంకా నిర్ద్వందంగా నిరూపితం కాలేదు. అందువల్ల, జన్యుమార్పిడి రకాలను ఈ విత్తన బిల్లుద్వారా అంగీకరించలేము. ఫార్మర్స్ వెరైటీకి చట్టంలో అవకాశాలు కల్పించినప్పటికి, ఈ అవకాశాన్ని గతంలో రైతుల పేరుతో కార్పొరేట్ సంస్థలు వినియోగించుకొని అక్రమ లాభాలు సంపాధించాయి. ఈ దురుపయోగాన్ని నివారించడానికి తగు జాగ్రత్తలను బిల్లులో పొందుపరచాలి. కర్నూలు, మహాబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని విత్తనోత్పత్తి రైతులను కార్పొరేట్ సంస్థలు నష్టపరిచాయి. రైతులకు నాణ్యతలేని మూల విత్తనాలను ఇవ్వడం, విత్తనాల సేకరణలో ఆంక్షలు పెట్టడంతో విత్తనోత్పత్తి రైతులు దివాళా తీసి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేంద్ర విత్తన కమిటీలో, క్లాజ్3 ప్రకారం, చైర్మన్కాక మరో 27మంది సభ్యులతో ఏర్పాటౌతుంది. దీనిలో నైపుణ్యం గలిగిన వారే కాక, రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించినట్లు ముసాయిదాలో ప్రకటించబడిరది. అయితే, దీనిలో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ అధికారులే సభ్యులుగా ఉన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించి ఒక్కొక్క జోనునుండి ఒక సభ్యునికి యేడాదిపాటు రొటేషన్ పద్ధతిపై కమిటీలో సభ్యత్వం కల్పించారు. జోన్ ఒకటిలో 7 రాష్ట్రాలున్యాయి. అందులో తెలంగాణ ఒకటి. అందువల్ల, రొటేషన్ పద్ధతిపై తెలంగాణకు 7 సంవత్సరాలల్లో ఒక సంవత్సరం కమిటీలో ప్రాతినిథ్యం ఉంటుంది. అయితే, విత్తన చట్టం అమలులో కేంద్ర విత్తన కమిటీకే రకాల రిజిస్ట్రేషన్, ఇతర ప్రధాన హక్కులు కేటాయించింది. ఫలితంగా, రాష్ట్ర ప్రధాన హక్కు ‘‘రకాల గుర్తింపు’’ రిజిస్ట్రేషన్ తీసివేయబడిరది. రాష్ట్ర విత్తన కమిటీకి (క్లాజ్ 10 ద్వారా) కేవలం సిఫారస్ చేసే అధికారం మాత్రమే ఇవ్వబడిరది.
క్లాజ్6 (ఎ) ద్వారా కేంద్ర విత్తన కమిటీకి కనీస మినిమం జర్మినేషన్ (మొలకెత్తె స్వభావం) నిర్దేశించబడిరది. అలాగే, జన్యుస్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత, ఇతర గుణగణాలు, విత్తన ఆరోగ్యం, నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే అధికారం కేంద్ర విత్తన కమిటీకి అప్పగించబడిరది. గత చట్టాలతో కూడా ఇదే విధంగా చెప్పి ఆ తర్వాత దీనిని 60శాతానికి తగ్గించే అవకాశం కల్పించారు. వాస్తవానికి జర్మినేషన్ కనీసం 80శాతం ఉండాలి. విత్తన స్వచ్ఛతకు గ్యారంటీ (ఫ్యూరిటీ) ఉండాలి. కానీ ఈ నిబంధనలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. రాష్ట్రాల హక్కులు : రాష్ట్ర విత్తన రిజిస్ట్రేషన్ హక్కులకు బిల్లులో స్థానం కల్పించాలి: వ్యవసాయం రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాల్లో ఉన్నందున ఈ రిజిస్ట్రేషన్ హక్కు రాష్ట్ర పరిధిలో ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయంలో రాజీపడకూడదు. అప్పుడే, రైతులకు అనువైన విత్తనాల ఎంపిక, సాగులో న్యాయం జరుగుతుంది. ఇదే విధంగా, రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం (విద్యాలయాలు), వాటి పరిశోధన సంస్థలు, ఇతర సంస్థలు రూపొందించిన కొత్త రకాలు రాష్ట్ర విత్తన కమిటీ ఆమోదంతో రాష్ట్ర పరిధిలో సాగుకు విడుదల చేసే అవకాశం బిల్లులో ఉండాలి. ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న సంస్థలు స్వయం దృవీకరణతో విత్తనాలను రైతులకు నేరుగా సరఫరా చేసే అధికారం కలిగి ఉండొచ్చు. అలాగే, కేంద్ర స్థాయిలో పనిచేస్తున్న ఐసిఎఆర్, ఇతర కేంద్ర పరిశోధన సంస్థలు, ప్రభుత్వ నిధులతో పనిచేసే ఇతర సంస్థలు నేరుగా తాము రూపొందించి, ఉత్పత్తి చేసిన విత్తనాలను స్వయం దృవీకరణతో రైతుల సాగుకు ఇవ్వగలగాలి. ప్రైవేట్ సంస్థలకు స్వయం దృవీకరణతో విత్తనాలను అమ్మే అవకాశం కలిపించకూడదు. ఒక వేళ కలిపిస్తే, విత్తనం విఫలమై రైతుకు నష్టం కలిగించినప్పుడు, అట్టి రైతుకు తప్పని సరిగా నష్ట పరిహారం చెల్లించే ఏర్పాటు బిల్లులో పెట్టాలి. ఈ సూచనలకు అనుగుణంగా: ముసాయిదా బిల్లును సవరించాలి. ‘‘రాష్ట్ర విత్తన కమిటీ’’లో చైర్మన్కాక మరో15 మందితో ఏర్పాటు చేయాలని సెక్షన్10 నిర్దేశిస్తుంది. వాస్తవానికి విత్తన పరిశోధనలు, ఉత్పత్తి రాష్ట్రాలలోనే జరుగుతుంది. ఇందుకు యూనివర్సిటీలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. విత్తన పరిశోధనకు తెలంగాణలో 27 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. వాటికి ఐసిఎఆర్ గుర్తింపు కూడా ఉంది. అందువలన, రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ నిధులతో పనిచేసే పరిశోధన సంస్థలు రూపొందించిన విత్తనాల రిజిస్ట్రేషన్‌కు కేంద్ర విత్తన కమిటీకి పరిమితం చేయడం సరికాదు. ఈ అధికారం రాష్ట్ర విత్తనకమిటీకి ఉండాలి. ఇతర సంస్థలు రూపొందించిన విత్తన రకాలసాగు కూడా రాష్ట్ర విత్తన కమిటీ ఆమోదానికి లోబడి ఉండాలి.
జాతీయ విత్తన రకాలు :
ఒకరాష్ట్రం కన్న ఎక్కువ రాష్ట్రాలకు సాగుకు అనుమతి ఉంటే, అట్టి రకాలను జాతీయ విత్తన రకాలుగా గుర్తించబడుతాయని క్లాజ్2(క్యూ) నిర్దేశిస్తుంది. దీని ఫలితంగా ఏ రెండు రాష్ట్రాలో గుర్తింపు పొందిన రకం అదే పేరుతో తెలంగాణలో కూడా సాగుకు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, వ్యవసాయ సాంకేతికం, ముఖ్యంగా పంట రకాలు, స్థానిక తత్వం కలిగి ఉన్నాయి. ఒక వ్యవసాయ వాతావరణ మండలంలో బాగా దిగుబడి ఇచ్చిన రకం మరో వ్యవసాయ వాతావరణ జోన్లో అధిక దిగుబడి ఇవ్వకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన, జాతీయ రకాలుగా విత్తనం గుర్తింపు పొందినప్పటికీ, లేదా ఇతర దేశాలనుండి దిగుబడి అయినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో విధిగా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో క్షేత్రపరీక్ష చేసిన తర్వాత మాత్రమే ఇటువంటి రకాలకు తెలంగాణలో సాగుకు అనుమతి ఇవ్వాలి. లేకపోతే, రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి అనుగుణంగా బిల్లును సవరించాలి. విత్తన రిజిస్ట్రేషన్‌కు ఇతర సంస్థలకు అధికారం ఇచ్చే ప్రతిపాధన: ముసాయిదా బిల్లు 12వ క్లాజ్ రెండో ప్రొవిజో ద్వారా కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో నేరుగా నియంత్రించి, ఇతరులకు కూడా కొత్త రకాలను రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించబడిరది. ఇది చాలా ప్రమాధకరమైన ప్రతిపాధన. రిజిస్ట్రేషన్ చేసే అధికారం ప్రభుత్వ ఆధీనంలో ఉండి, పనిచేస్తున్న ఇతరులకు అప్పగించడం అంటే ఇది ఒక విధమైన ‘‘ఔట్ సోర్సింగ్ (బయటివారికి పని అప్పగించడం)’’. ఈ ప్రొవిజన్‌ను ప్రైవేట్ కంపెనీలు దురపయోగం చేసే అవకాశం ఉంది. అందువల్ల, దీనిని బిల్లులో తొలగించాలి. ఏ ఇతర దేశంలోనైనా సాగు విలువ, ఉపయోగం (వాల్యూ ఫర్ కల్టివేషన్ ఆండ్యూజ్) : అంగీకరించకూడదు. విత్తన రకాల వినియోగం సాగు విలువ, ఉపయోగాన్ని నిర్ధారించటానికి సెక్షన్ 16 (3)లో ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనైనా, ఎక్కడైనా విత్తన ట్రయల్స్‌కు అనుమతించే అవకాశం కల్పించబడిరది. ఇది చాలా ప్రమాదకరమైంది. వివిధ పంటల రకాలపై వాతావరణ పరిస్థితులు నేరుగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల, మనదేశంలోనే పలు వ్యవసాయ వాతావరణ మండళ్లు గుర్తించబడ్డాయి. ఇక ఏదో ఇతర దేశంలో వేరుగా ఉండే వ్యవసాయ వాతావరణ పరిస్థితులలో అంచనా వేసిన వివిధ రకాల సాగు విలువ, వినియోగం మన దేశంలో సరిపోదు. ఏ రకాన్ని మన దేశంలో సాగుకు అనుమతి ఇవ్వాలన్నా దానికి సంబంధించిన వ్యవసాయ వాతావరణ మండలంలో సాగు, ఉపయోగం విలువలకు అంచనా వేసిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వాలి. ఈ విషయంలో ఎటువంటి రాజీ తగదు. తప్పు నిర్ణయం జరిగి రైతు నష్టపోతే ఎవరు నష్ట పరిహారం చెల్లిస్తారు?
క్వారంటీన్ నిర్వాహణ :
సెక్షన్ 33 లో విదేశాల నుండి దిగుమతి అయ్యె విత్తనాలను 21రోజుల క్యారైంటీన్కు అవకాశం కల్పించబడిరది. దీనిని కఠినంగా అమలు చేయాలి. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల విదేశాల నుండి కలుపు మొక్కలుగొల్లబామ, సర్కారు తుమ్మ లాంటివి విస్తారంగా వచ్చాయి. వీటితోపాటు బర్డ్‌ఫ్లూ, మ్యాడ్‌కౌ, మౌత్డిసీజ్, గాలికుంటు వ్యాధి, గులాభిరంగు పురుగు, తామర లాంటి జబ్బులు విదేశాల నుండి దిగుమతయ్యాయి. నేడు అవి మన రైతులను పట్టి పీడిస్తున్నాయి. ఎరువుల కన్న క్రిమీసంహారక మందులకే నేడు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీనికి అనుగుణంగా ముసాయిదా బిల్లును పఠిష్టపరచాలి. మోన్శాంటో కంపెనీలు రసాయనాలను తయారు చేసి కోట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి.
ఐసిఎఆర్, దాని సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వాటి సంస్థలు స్వయం దృవీకరణపై కొత్త విత్తనాలను రైతులకు నేరుగా అమ్మేఅవకాశం కల్పించాలి. క్లాజ్21 (1) రిజిస్ట్రర్ చేసిన విత్తన అమ్మకాల నియంత్రణకు సంబంధించిన క్లాజ్‌లో దిగుమతి, ఎగుమతులకు అవకాశం కల్పించబడిరది. ఈ దిగుమతులపై ఎలాంటి నియంత్రణను బిల్లులో చేర్చలేదు. ఎటువంటి సందర్భాల్లో విత్తనాల్ని ఎగుమతులను చేసుకోవచ్చు అనే కండీషన్లనుకూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది భారత రైతులకు, ఆహార పోషక భద్రతలకు చాలా ప్రమాధకరం. ఎట్టి పరిస్థితుల్లో ఏ పంటల ఏ రకాలను దిగుమతి చేసుకోవచ్చో అనే దానికి స్పష్టమైన నియమాలు చట్టరూపంలో ఉండాలి. ఈ మేరకు బిల్లును మార్చాలి.
ఇదే విధంగా, ప్రైవేట్ సంస్థలు, పబ్లిక్ సంస్థలు విత్తనాల్ని అమ్మేటప్పుడు ఒకే విధంగా గుర్తించబడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల విద్యాలయాలు పరిశోధన సంస్థలు అత్యంత నిపుణులను, సమర్థతను కలిగి ఉన్నాయి. ఇంతవరకు ఈ సంస్థలు సరఫరా చేసిన విత్తనాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అందువల్ల, ఈ సంస్థల విత్తనోత్పత్తులకు కేవలం స్వయం దృవీకరణతో రైతులకు నేరుగా విత్తనాల్ని అందించే విధంగా బిల్లును మార్చాలి.
ప్రైవేట్ విత్తన వ్యాపార సంస్థలు స్వయం దృవీకరణపై రైతులకు విత్తనాలు అమ్మకాన్ని అనుమతించడం ప్రమాదంతో కూడుకుంది. విత్తన విషయాల్లో ఈ సంస్థలు అమ్మే విత్తనాల వల్లే రైతులు ఫలు నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల, ఈ సంస్థలు తమ విత్తనాల్ని తప్పనిసరిగా విత్తన దృవీకరణ సంస్థ ద్వారా సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే విత్తనాల్ని అమ్మే అవకాశం కల్పించాలి. ఒక వేళ వీటికి సొంత దృవీకరణ అవకాశం కల్పిస్తే, వీరి విత్తనం వల్ల రైతు నష్టపోయిన సంధార్భాల్లో నష్ట పరిహారం ఆయా కంపెనీ చెల్లించేలా బిల్లును సవరించాలి.
విత్తన ధరల నియంత్రణ :
ముసాయిదాలో బిల్లులో క్లాజ్ 22లో కేవలం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే విత్తన ధరల నియంత్రణకు అవకాశం కల్పించబడిరది. కేంద్ర వ్యవసాయోత్పత్తుల ఖర్చులు, ధరల నియంత్రణ కమిషన్ తాజా ధరల నివేధికలను గమనిస్తే విత్తన ధరలు ప్రతి సంవత్సరం ఇతర ఖర్చుల కన్న వేగంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో, విత్తన కంపెనీలు విత్తన రైతులకు చెల్లించే ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా, ఒక వైపు విత్తనోత్పత్తి రైతులు సంక్షోబ పరిస్థితులను ఎదుర్కొంటుండగా పంటల్ని వాణిజ్య స్థాయిలో పండిరచే రైతులు కూడా వేగంగా పెరుగుతున్న విత్తన ధరలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ దుస్థితి కేవలం విత్తన కంపెనీల అధిక లాభాపేక్ష వలన కలుగుతోంది. ఈ దుస్థితిని సవరించటానికి విత్తన ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్ఛితంగా విత్తన ధరల నియంత్రణ అధికారం ఉండాలి. విత్తన సేకరణ ధరలకు, విత్తన అమ్మకం ధరలకు, నేరుగా సంబంధాన్ని బిల్లులో నిర్ధేశించాలి. ఆయా పంటలను బట్టి ఇది మారుతుంది. అదే విధంగా, విత్తన ధరకు, ఆ విత్తనాల ఉత్పత్తుల ధరలకు కూడా సంబంధం ఉండాలి. బీటి పత్తి విత్తనాల ఉత్పత్తిలో ప్రారంభంలో అధిక రాయల్టివలన 450 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర రూ.1800లకు పైగా నిర్ణయించబడిరది. రైతుల ఒత్తిడి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిడితో రాయల్టిభారం తగ్గించబడిరది. ఆ సందర్భంలో ఇటు రైతులు, అటు ప్రభుత్వం కంపెనీల నుండి ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని కేసులు ఇప్పటికీ కోర్టులో ఉన్నాయి. అందువల్ల, రాయల్టి చెల్లించాల్సిన సందర్భంలో ‘‘సన్‌సెట్ క్లాజ్’’ను అనివార్యంగా బిల్లులో చేర్చాలి. విత్తన ధరల నియంత్రణ లేకుండా విత్తన చట్టం రైతులకు ఏమాత్రం సహాయకారిగా ఉండదు. విదేశాలల్లో సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీల గుర్తింపు : క్లాజ్ 27 ద్వారా ఈ అవకాశం కల్పించబడిరది. ఇది ఏ మాత్రం అంగీకారం కాదు. ముఖ్యంగా, వ్యవసాయ వాతావరణ మండలాల్లో ఉన్న తేడాలు, ఈ తేడాలు ఆయా రకాల దిగుబడులు, చీడ, పీడలపై గల దుష్ప్రభావాలను గమనంలో ఉంచుకోవాలి. ఏ వ్యవసాయ వాతావరణ మండలంలో నైనా ఎదైనా రకాన్ని సాగుకు గుర్తించి, అనుమతించాలంటే దానిని తప్పని సరిగా సాగు ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయ వాతావరణ మండలంలో ‘‘సాగు విలువ ఉపయోగం’’పై ప్రభుత్వ బడ్జెట్‌తో నడిచే సంస్థలో తప్పనిసరిగా అంచనా వేయాలి. అప్పుడే ఆయా రకాల సాగును అనుమతించాలి.
విత్తనలోపం వల్ల నష్టం కలిగినప్పుడు రైతుకు పరిహార చెల్లింపు :
ముసాయిదా బిల్లులో నాణ్యత లేని విత్తనాలు లేక తప్పు బ్రాండ్‌తో విత్తనం అమ్మకం వలన రైతులు పంట నష్టపోయిన సందర్భాలలో పరిహార చెల్లింపుకు ఎటువంటి ప్రతిపాధన లేదు. కేవలం కంపెనీలపై నామమాత్రపు పెనాల్టీ విధించేందుకు ఏర్పాటు ఉంది. కోట్లకొద్ది వ్యాపారం చేసే కంపెనీల మీద కొన్ని వేలు లేదా లక్షల రూపాయలు పెనాల్టీ ఏమాత్రం దుస్థితిని నివారించలేదు. అందువల్ల, బిల్లులో తప్పుచేసిన కంపెనీలపై పెనాల్టీని పెంచడంతోపాటు బాధ్యులను శిక్షించే ఏర్పాటు ఉండాలి. ఆ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి. వ్యవసాయ రంగం రాజ్యాంగంలో రాష్ట్రాలకు సంబంధించినందున, విత్తన రిజిస్ట్రేషన్, నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల హక్కు తగ్గింపును ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించకూడదు.
విత్తనోత్పత్తి, దృవీకరణ, రిజిస్ట్రేషన్, మరియు ధరల నిర్ణయం, రాష్ట్ర జాబితాలో ఉంచాలి. వాతావరణ జోన్స్లలోనే విత్తనాల ట్రయల్స్ జరపాలి. కంపెనీలు రైతులను మోసగించినచో లేక లోపబూయిష్ట విత్తనాలను సరఫరా చేస్తే రైతుకు జరిగిన నష్టాన్ని కంపెనీలు చెల్లించాలి. వాటి లైసెన్స్‌ను రద్దుచేయాలి. తిరిగి మంచి విత్తనాలను రైతులకు సరఫరా చేయాలి.
విత్తనోత్పత్తి రైతులతో కంపెనీలు ‘‘మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండిరగ్’’ ఒప్పంధాన్ని రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ దగ్గర డిపాజిట్ చేయాలి. ఒప్పంధానికి బిన్నంగా ఎవరూ అతిక్రమించకుండా నిఘా వ్యవస్థ ఉండాలి. నేరాలను నెల రోజులల్లో పరిష్కరించాలి. దేశంలోని రైతులకు కావాల్సిన విత్తనాలను ఎఫ్`1 హైబ్రీడ్, సర్టిఫైడ్ సీడ్ పంపిణీ జరిగిన తర్వాతనే విదేశాలకు ఎగుమతిని అనుమతించాలి.
విత్తన నియంత్రణ: రాష్ట్రంలో జరుగుతున్న విత్తన పరిశోధనలను, పరిశోధన కేంద్రాలు, ల్యాబ్ సెంటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. నాణ్యత లేని విత్తనాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధ్యులపై చట్టపరచర్యలు చేపట్టడానికి వీలుగా చట్టంలో నిబంధనలు ఉండాలి. వాటిని అమలు జరిపే యంత్రాంగం ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఇది చాలా అవసరం. దేశ విత్తనోత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ‘‘విత్తన గోదామ్గా’’ చేయాలని గతంలో అనేక ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించి విఫలమైంది. ప్రస్తుత ముసాయిదా బిల్లును రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్యయనం చేసి, రాష్ట్రాల హక్కులను కాపాడే విధంగా సవరణలు కేంద్రానికి పంపించాలి….మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి