ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయరంగంలో మార్పులు:తుమ్మల
తెలుగు ప్రజలకు,రైతు సోదరులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.సత్తుపల్లి అశ్వారావుపేట కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం దమ్మపేట మండల పరిధిలోని తుమ్మల స్వగ్రామం గండుగులపల్లి లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారందరినీ ఆప్యాయంగా పలకరించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.పలు విషయాలపై వారితో మాట్లాడుతూ చక్కని పాడి పంటలతో రైతుల ఇళ్లలో సంతోషాలు నిండాలని రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ పాలన ఉందన్నారు.
సంక్రాంతిపండుగ పర్వదినాలతో ఈ మూడురోజులు పల్లెలు ఎలా కళకళలాడతాయో అదే విధంగా సంవత్సరం పొడవునా కళకళలాడుతూ ఉండాలని,పాడి పంటలు పశు సంపదతో రైతులు సంతోషంగా ఉండాలన్నారు. ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయరంగంలో ప్రభుత్వం తెస్తున్న విప్లవాత్మక మార్పులు రైతులకు వరంగా మారాలన్నారు
దమ్మపేట మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామంలో బుధవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. శ్రీరాంపురం గ్రామ సమీపంలో గ్రామస్తులు వాకింగ్ ట్రాక్ కోసం ఏర్పాటు చేసుకున్న రోడ్డుకు ఇరువైపులా మంత్రి తుమ్మల మొక్కలు నాటారు. వేసిన ప్రతి మొక్క బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కు, గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో: మంత్రి తుమ్మలతో పాటు నున్నా రత్నారావు, దొడ్డా ప్రసాదు, పైడి వెంకటేశ్వరరావు, నాగప్రసాద్, అచ్యుతరావు, కె.వి తోపాటు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, తుమ్మల అభిమానులు, శ్రీరాంపురం గ్రామస్తులు పాల్గొన్నారు.