ఆధ్యాత్మిక సమన్వయానికి ప్రతీక అన్నారం షరీఫ్
భక్తుల కొంగుబంగారం-హజ్రత్ యాకూబ్ షా వలీ బాబా దర్గా మత సామరస్యానికి ప్రతీక అన్నారం షరీఫ్ దర్గా, యాకూబ్ షా వలీ బాబా క్షేత్రానికి రాష్ట్రాలకతీతంగా భక్తుల తాకిడి, సంతానం,ఆరోగ్యం,కుటుంబ శాంతి కోసం మొక్కులు-అన్నదానాలు, ఉర్సు ఉత్సవాలతో వెల్లివిరుస్తున్న సూఫీ సంప్రదాయం, దర్శనం పేరుతో దోపిడి ఆరోపణలు-టికెట్ల వసూళ్లపై భక్తుల ఆగ్రహం, కాంట్రాక్టర్ల ద్వారా అనధికారంగా అధిక మొత్తాల వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణ, పేద,మధ్యతరగతి భక్తులకు భారంగా మారిన దర్శన విధానం, ఉచిత దర్శనం అమలు చేయాలని డిమాండ్, వక్ఫ్ బోర్డు-జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోవాలన్న పిలుపు, ఉర్సు వేళ భద్రత,ట్రాఫిక్,మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షా వలీ బాబా దర్గా కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు.తరతరాలుగా ప్రజల విశ్వాసానికి నిలయంగా,ఆధ్యాత్మిక శాంతికి కేంద్రంగా,హిందూ-ముస్లిం సామరస్యానికి చిరునామాగా ఈ దర్గా విరాజిల్లుతోంది.మత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఒకే చోట కలిపే అరుదైన సూఫీ క్షేత్రంగా అన్నారం షరీఫ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
“యాకూబ్ షా వలీ బాబా-త్యాగం,తపస్సు,మానవసేవ”
స్థానిక చరిత్ర కథనాల ప్రకారం హజ్రత్ సయ్యద్ యాకూబ్ షా వలీ బాబా అరబ్ దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చారు.పేదల పట్ల అపారమైన కరుణతో,తనకున్న ఆస్తినంతా దానం చేసి దేశాటన చేస్తూ చివరకు అన్నారం గ్రామంలో స్థిరపడ్డారని భక్తుల విశ్వాసం.త్యాగం,తపస్సు,మానవసేవలను జీవిత లక్ష్యాలుగా చేసుకున్న బాబా,ప్రజల మధ్య ప్రేమ,సౌభ్రాతృత్వం,సహనం వంటి విలువలను ప్రచారం చేశారు.“మనవత్వమే మహా ధర్మం”అనే సూఫీ తత్వాన్ని ఆయన తన జీవితం ద్వారా ఆచరించి చూపారన్నది భక్తుల నమ్మకం.బాబా ఇక్కడ నివసించి ఆధ్యాత్మిక బోధనలు చేయడంతోనే ఈ గ్రామానికి‘అన్నారం షరీఫ్’అనే పేరు స్థిరపడిందని చెబుతారు.
“నమ్మకానికి కేంద్రం-ఆధ్యాత్మిక మానసిక చికిత్సాలయం”
అన్నారం దర్గాను భక్తులు ఒక ఆధ్యాత్మిక మానసిక చికిత్సాలయంగా భావిస్తారు.వైద్యులకు కూడా నయం కాని మానసిక సమస్యలు,మనోఘాతాలు,కుటుంబ కలహాలు,గ్రహ దోషాలు బాబాను దర్శించుకుని దర్గా ఆవరణలో కొంతకాలం గడపడం వల్ల తగ్గుతాయని భక్తుల విశ్వాసం.బాబా మహిమలతో అనేక మంది మానసిక ప్రశాంతత పొందినట్లు స్థానికులు చెబుతున్నారు.
“మొక్కులు-సంప్రదాయాలు”
సంతాన లభ్యత,అనారోగ్య సమస్యల నుంచి విముక్తి,ఉపాధి-విద్యలో పురోగతి,కుటుంబ శాంతి వంటి ఆశయాలతో భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు.గంధం సమర్పించడం,చాదర్ సమర్పించడం,అన్నదానం చేయడం వంటి సంప్రదాయాలు విస్తృతంగా పాటించబడుతున్నాయి.దర్గా ఆవరణలోని వేప చెట్లకు తాయెత్తులు కట్టడం కూడా ఇక్కడి ప్రత్యేక ఆచారం.
“ఉర్సు-సామాజిక ఐక్యతకు పండుగ”
ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఉర్సు ఉత్సవాలు ఈ దర్గా ప్రత్యేకతకు మరింత వన్నె తెస్తాయి.ఉర్సు సందర్భంగా ఖవ్వాలీ కార్యక్రమాలు,ఆధ్యాత్మిక బోధనల ప్రసంగాలు,సామూహిక అన్నదానం నిర్వహించబడతాయి.హిందువులు,ముస్లింలు,ఇతర మతాలవారు సమానంగా పాల్గొనడం ఈ ఉత్సవాల ప్రధాన విశిష్టతగా నిలుస్తోంది.రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర,కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
“సామాజిక జీవితంలో దర్గా పాత్ర”
అన్నారం దర్గా గ్రామీణ సామాజిక జీవితంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.పేదలకు ఆహారం అందించడం,అవసర సమయంలో సహాయం చేయడం,గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడం వంటి కార్యక్రమాల ద్వారా ఇది ఒక మానవతా కేంద్రంగా నిలిచింది.
“అభివృద్ధి అవసరం”
ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధి,రహదారి సౌకర్యాల మెరుగుదల,తాగునీరు-పారిశుద్ధ్య ఏర్పాట్లు,ఉర్సు సమయంలో ట్రాఫిక్ నియంత్రణ,భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టి అవసరమని స్థానికులు కోరుతున్నారు.
“అన్నారం షరీఫ్ కు చేరుకునే మార్గం”
హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించి,అక్కడి నుంచి పర్వతగిరి మండలం మీదుగా అన్నారం షరీఫ్ దర్గాకు చేరుకోవచ్చు.వరంగల్ నగరం నుంచి దర్గాకు దూరం సుమారు 38 నుంచి 45 కిలోమీటర్లు.అన్నారం యాకూబ్ షా వలీ బాబా దర్గా ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు,ఇది మత సామరస్యానికి ప్రతీక,మనవత్వానికి నిలువెత్తు సాక్ష్యం.కాలం మారినా,తరాలు మారినా ప్రేమ-శాంతి-సమానత్వం అనే విలువలు నిలిచేంతవరకు ఈ దర్గా ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని కలిగి ఉంటుంది.
“భక్తులపై దోపిడి ఆరోపణలు-చర్యలు తీసుకోవాలని డిమాండ్”
ఇదిలా ఉండగా,అన్నారం షరీఫ్ దర్గాను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల వద్ద కొందరు కాంట్రాక్టర్లు టికెట్ల రూపంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దర్శనం,ప్రత్యేక ప్రవేశం,మొక్కుల పేరిట అనధికారికంగా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ దోపిడీ వల్ల పేద,మధ్యతరగతి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అంటున్నారు.సంబంధిత అధికారులు,వక్ఫ్ బోర్డు,జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని అనధికార వసూళ్లను అరికట్టి భక్తులకు ఉచితంగా,పారదర్శకంగా దర్శనం కల్పించే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు