ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి-ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Uncategorized
ఈ69 న్యూస్ జనగామ జూలై 28
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు.జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నిజమైన అర్హులైన పేదలకే ఇళ్లు కేటాయించాం.లబ్ధిదారులకు ఇళ్ల బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకూడదు. పనులు ప్రారంభించని వారు ఆగస్టు 3వ తేదీ లోగా నిర్మాణానికి సిద్ధం కావాలి.లేని పక్షంలో వారికి నోటీసులు జారీ చేయాలి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు మొత్తం 3,500 ఇళ్లను మంజూరు చేయగా,జనగామ జిల్లాలో 2,486,హనుమకొండ జిల్లాలో 1,014 ఇళ్లను కేటాయించినట్టు వెల్లడించారు.ప్రస్తుతం ఫేజ్-1,2ల్లో మంజూరు అయిన ఇళ్ల నిర్మాణాల్లో 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యేలా ఈ నెల 31వ తేదీ లోగా కృషి చేయాలన్నారు.ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను లబ్ధిదారులకు సమగ్రంగా వివరించాలని,అవసరమైతే డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు పొందేందుకు మార్గదర్శనం చేయాలని అధికారులను ఆదేశించారు.పునాదిలో మట్టి నింపుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు స్థానికంగా మట్టి,ఇసుక లభ్యమయ్యేలా రెవెన్యూ,పోలీస్ శాఖలు సహకరించాలి అని సూచించారు.పేదలకు ఇల్లు ఇవ్వడం కన్నా గొప్ప పని లేదని భావిస్తున్నాం.ప్రతి లబ్ధిదారుడూ తాము స్వంత ఇంటి కలను సాకారం చేసుకునేలా అధికార యంత్రాంగం పటిష్టంగా పని చేయాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్,రోహిత్ సింగ్,ఆర్డీఓ వెంకన్న,హౌసింగ్ పీడీలు జనగామ మత్రు నాయక్,హనుమకొండ సిద్ధార్థ,మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ,ఎంపీడీవోలు,హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.