ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ
వరంగల్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డులు, మందుల సరఫరా విధానం, వైద్య సేవల నాణ్యత తదితర అంశాలను ఎంపీ స్వయంగా పరిశీలించారు.రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ జిల్లాకు త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి సౌకర్యాలను ఇప్పటి నుంచే బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.అనంతరం ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందితో సమావేశమై నిర్వహణలో ఉన్న లోటుపాట్లు, సదుపాయాల కొరతపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యుల ఖాళీల భర్తీ, మందుల సరఫరా లోపాలు, శానిటేషన్ పరిస్థితులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి అవసరమైన నిధులు, వసతులపై ప్రతిపాదనలు అందిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.అలాగే ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రత మెరుగుపరచడంతో పాటు పొదలు, అడవి మొక్కలను తొలగించి తక్షణ శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి. సాంబశివరావు, సివిల్ సర్జన్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ అశోక్, డాక్టర్ రామచంద్ర, ఆర్ఎంఓ డాక్టర్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.