ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు
ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతమైన మరియు మెరుగైన సేవలు అందించగలరని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల సందర్భంగా మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించగలరని తెలిపారు.ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం చాలా అవసరమని అన్నారు. ఈ మెగా ఆరోగ్య శిబిరం ద్వారా ఉద్యోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందిస్తున్నామని తెలిపారు.ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఆరోగ్య అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ శిబిరంలో మెడికవర్ వైద్యులు, ప్రభుత్వ వైద్య బృందం ఉద్యోగులకు రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు, కంటి పరీక్షలు తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, టీజీఓ కార్యదర్శి సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డా. మధుసూదన్, ఫణి కుమార్, డా. వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, స్వాతి, టీజీఓ ప్రతినిధులు, మెడికవర్, ప్రభుత్వ వైద్యులు డా. శ్రీదేవి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు