ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం
విబీ-జీ రామ్-జీ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలి
గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలి
సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘాల డిమాండ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని,వెంటనే వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్ గారీ అండ్ అజీవక మిషన్ గ్రామీణ్ 2025 (విబీ-జీ రామ్-జీ) బిల్లును వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింగారపు రమేష్ డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి రైతు సంఘం జిల్లా నాయకులు మీట్యా నాయక్ అధ్యక్షత వహించారు.వక్తలు మాట్లాడుతూ..గ్రామాల్లో వలసలను నివారించి,స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వామపక్షాల దీర్ఘకాల పోరాటాల ఫలితంగా 2005లో యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు.ఈ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరించిందన్నారు.అయితే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చట్టానికి క్రమేణా తూట్లు పొడుస్తూ నిధులను గణనీయంగా తగ్గించడంతో పాటు ఉపాధి పొందుతున్న కూలీల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారని విమర్శించారు.దేశవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ తదితర బలహీన వర్గాల నిరుపేద కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడం అన్యాయమన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 90 శాతం,రాష్ట్రాలు 10 శాతం నిధులు విడుదల చేస్తున్న వ్యవస్థను మార్చి,కొత్త బిల్లులో కేంద్ర వాటాను 60 శాతానికి కుదించి,రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం దారుణమని అన్నారు.ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారాన్ని మోపుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మహాత్మాగాంధీ పేరును తొలగించి,ఉపాధి హామీ చట్టాన్ని విబీ-జీ రామ్-జీగా మార్చి, పార్లమెంట్లో సరైన చర్చ లేకుండా,ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బిల్లును ఆమోదింపజేయడం బీజేపీ అహంకార ధోరణికి నిదర్శనమని ఆరోపించారు.గాంధీ ఆలోచనలతో రూపుదిద్దుకున్న గ్రామీణ పేదల ఉపాధి హక్కును హరించేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు.బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికులను కట్టుబానిసలుగా మార్చే చర్యగా పేర్కొన్నారు.అలాగే విద్యుత్ సవరణ-2025 బిల్లుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు.రాబోయే కాలంలో ఉపాధి హక్కు రక్షణ కోసం ప్రజా సంఘాలు,ప్రజాస్వామ్యవాదులు,గ్రామీణ పేదలు ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాపురం మహేందర్,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బూడిద ప్రశాంత్, రైతు సంఘం పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గంగరబోయిన మల్లేష్,రాజ్,శివరాత్రి రాజు,చీర శ్రీను,గుండె మల్లేష్,గట్టయ్య,నాగరాజ్ ఓద్య తదితరులు పాల్గొన్నారు.