జాఫర్గడ్ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో శనివారం జరిగిన ఎన్నికల సంబంధిత సమావేశంలో సీపీఐ,సీపీఎం పార్టీ నాయకులు పలు డిమాండ్లు చేశారు.ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జువారి రమేష్,సీపీఎం మండల కార్యవర్గ సభ్యుడు కటా సుధాకర్ మాట్లాడుతూ..గ్రామాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఒకే వార్డులో ఉండాల్సిన సందర్భంలో వారిని వేర్వేరు వార్డుల్లో చేర్చడం జరుగుతోందని విమర్శించారు.సాంకేతికంగా ముందున్న రాష్ట్రంలో ఇలాంటి తప్పులు జరగడం విచారకరమని,అధికారులు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి లోపాలు ఓటర్లకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.ఓటర్ల జాబితా సవరణలో ఉన్న తప్పులను వెంటనే సరిచేసి,ఒకే కుటుంబ సభ్యులు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు ఎంపిడిఓకి వినతి పత్రం అందించారు.