
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలతో పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్నేహా శబరీశ్ ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించగా, అదే జిల్లాలో ఆమె భర్త శబరీశ్ ఇప్పటికే జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఒకే జిల్లాలో భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా బాధ్యతలు చేపట్టడం అరుదైన ఘటనగా నిలిచింది. జిల్లా పరిపాలనలో కలెక్టర్ కీలక నిర్ణయాలు తీసుకుంటే, శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ బాధ్యత వహిస్తారు.ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకే జిల్లాలో కీలక పదవుల్లో ఉండటం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇప్పటి వరకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ ను ప్రభుత్వం మరో జిల్లాకు బదిలీ చేసింది.స్నేహా శబరీశ్ గతంలో హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా సేవలందించి పరిపాలనలో మంచి గుర్తింపు పొందారు.ఇప్పుడు మహబూబాబాద్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణలో ఈ దంపతులు సమన్వయంతో పనిచేస్తారని అధికారులు భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు ఒకే జిల్లాలో కీలక స్థానాల్లో ఉండటం రాష్ట్ర పరిపాలనా చరిత్రలో అరుదైన సందర్భంగా నిలిచింది.