కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు
జనగాం జిల్లా కేంద్రంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సందడి చేశారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్లను విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమలోని సృజనాత్మకతను చాటుతూ..తాము స్వయంగా రంగురంగులతో తీర్చిదిద్దిన గ్రీటింగ్ కార్డులను అధికారులకు అందజేశారు.విద్యార్థుల ప్రతిభను చూసి కలెక్టర్ రిజ్వాన్ బాషా ముగ్ధులయ్యారు.వారిని పేరుపేరునా పలకరించి కుశలప్రశ్నలు వేశారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
అనంతరం కలెక్టర్,అడిషనల్ కలెక్టర్లు విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఇలాంటి సృజనాత్మక కళల్లో కూడా రాణించడం అభినందనీయమన్నారు.కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అలంకరించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఈ సందర్భంగా అధికారులు భరోసా ఇచ్చారు.తమను ఆప్యాయంగా పలకరించి,ప్రోత్సహించిన అధికారులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు సంబంధిత హాస్టల్ వార్డెన్లు,సిబ్బంది పాల్గొన్నారు.