కల్తీ కల్లు తయారు చేసి అమ్ముతున్న కల్లు కంపౌండ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
Uncategorizedఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం విడనాడి నిరంతరం తనిఖీలు చేయాలి
-డివైఎఫ్ఐ
రాష్ట్ర ప్రభుత్వం కల్తీకల్లును తయారుచేసి అమ్ముతున్న కల్లు కాంపౌండ్స్ నిర్వాహకులను,కాంట్రాక్టర్లను కఠినంగా శిక్షించి కళ్ళు కాంపౌండ్లను సీజ్ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావిద్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)ఆధ్వర్యంలో కల్తీ కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలని, ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ ఖురేషి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ కల్లు ఘటనలు వరుసగా జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ధనార్జనే ధ్యేయంగా కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు కృత్రిమంగా రసాయనాలతో కల్తీ కల్లు ను తయారు చేసి అమ్మడంతో అది సేవించిన ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురై మరణిస్తున్నారు. రాష్ట్రంలో కల్లు కాంపౌండ్ల పైన ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతరమైన తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంతో మత్తు పదార్థాలైన రసాయనాలతో కల్లును తయారుచేసి అమ్ముతున్నారని అన్నారు. ఇలాంటి కల్తీ మాఫియా పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప నిరంతరమైన నిఘాను ఏర్పాటు చేసి తనిఖీలు చేయించడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. కూకట్పల్లి పరిధిలోని ఇందిరానగర్ బస్తికి చెందిన 8 మంది నిరుపేదలు కల్తీ కళ్ళు తాగి మరణించడం జరిగిందన్నారు. ఇప్పటికే 44మంది అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీ కల్లు ఘటనకు కారకులైన వారిపై హత్యా నేరం కేసు నమోదు చేసి కల్తీ కల్లు తయారు చేస్తున్న ముఠాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు జావీద్, నాయకులు రాజయ్య తదితరులు పాలొగొన్నారు.