కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి:సీపీఎం
నియోజకవర్గ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి (తెలంగాణ వైద్య విధాన పరిషత్)లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ, సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్య సేవలు, సిబ్బంది, మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.సర్వేలో జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ వైద్యుడు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు, ఫిజీషియన్లు, పాథాలజిస్టు, డెంటల్ వైద్యుడు, ఎంబీబీఎస్ వైద్యులు, కంటి వైద్యుడు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు పోస్టులు ఖాళీగా లేదా తాత్కాలిక నియామకాలతో కొనసాగుతున్నట్లు గుర్తించారు. హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని కోరారు.
ఆస్పత్రిలో ఈసీజీ, ఎక్స్‌రే యంత్రాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న 40 పడకలను 80కు పెంచాలని, ఆర్థోపెడిక్ పరికరాలు, ట్రామా కేర్, అంబులెన్స్, 50 ఐవీ స్టాండ్లు, ఆపరేషన్ థియేటర్‌కు రెండు సెట్ల శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే పోస్టుమార్టం కోసం ఆటాప్సీ టేబుల్, పురుష, మహిళా నర్సింగ్ ఆర్డర్లీలు, నాలుగు ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రిలో ఐసీయూ, బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా శానిటేషన్ వర్కర్లు, పేషెంట్ కేర్ సిబ్బందిని నియమించాలని, ప్రత్యేక వంటశాల, పార్కింగ్ షెడ్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని విధాలుగా బలోపేతం చేయాలి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో: సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు తన్నీరు కృష్ణార్జున్ రావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, వ్యవసాయ కార్య సంఘం మండల అధ్యక్షులు దోమతోటి పుల్లయ్య, సిఐటియు నాయకులు గంపల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.