కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించాలి
గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం శాయంపేట మండల పరిధిలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసంతాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయానికి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ గ్రామానా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతులు, మహిళలు, యువత, పేద వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలతో కలిసి పాలన సాగించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చుతామని హామీ ఇచ్చారు.గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలందించే సర్పంచ్ పాత్ర కీలకమని, అందుకే అభివృద్ధికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటిస్తూ, అభివృద్ధి కొనసాగింపునకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని తెలిపారు