కార్మిక నాయకుడు, ప్రజా ధన బలం కలిగిన పాలడుగు భాస్కర్ విజయం ఖాయం: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు | బోనకల్లు లో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ
Uncategorizedసిపిఎం మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్ విజయం ఖాయమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. పాలడుగు భాస్కర్ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల వ్యాప్తంగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీని స్థానిక పెట్రోల్ బంకు వద్ద పొన్నం వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు సిపిఎం జెండా ఊపి మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర నియోజకవర్గం లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. అభివృద్ధి జరగాలంటే సిపిఎం ఎమ్మెల్యే వల్లనే అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు బూర్జువా, పెట్టుబడుదారుల ప్రతినిధులని, వారికి ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలు పట్టవన్నారు. ఎమ్మెల్యే పదవిని వీరు అడ్డుపెట్టుకొని సంపాదనకు పాల్పడతారన్నారు. అదే సిపిఎం ఎమ్మెల్యే పాలడుగు భాస్కర్ ప్రజా సమస్యల కోసం ఉపయోగిస్తారన్నారు. శాసనసభలో సిపిఎం మధిర ఎమ్మెల్యే ఉండటం వలన గతంలో అభివృద్ధి ఎలా జరిగిందో ప్రస్తుతము అదే విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అమరజీవి బోడేపూడి వెంకటేశ్వరరావు మృతితో నిలిచి పోయిన అభివృద్ధి తిరిగి ప్రారంభం కావాలంటే ఓటర్లందరూ ఒకసారి ఆలోచించి పాలడుగు భాస్కర్ ను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజు గత ఐదేళ్లుగా పదవిలోనే ఉన్నారని, పదవిలో ఉన్నపుడు చేయని అభివృద్ధి మరల తమకు పదవి అప్పగిస్తే అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని ఇది నిజమా కాదా ప్రజల ఒక్కసారి ఆలోచించాలని కోరారు. పాలడుగు భాస్కర్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారని అనేక అసంఘటిత, సంఘటిత కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసి విజయం సాధించారన్నారు. కమల్ రాజు, మల్లు భట్టి విక్రమార్క ఏ పోరాటాలు, ఎవరి కోసం పోరాటాలు చేశారో, వారు సాధించిన విజయాలు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. సిపిఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్ కు మాత్రమే ఉందన్నారు. గత 20 ఏళ్లుగా పదవి లేకపోయినా సిపిఎం, సిఐటియు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తూనే ఉంది అన్నారు. ఐదేళ్లుగా సాగర నీళ్లు రాక ప్రతి సంవత్సరం పంటలు ఎండిపోతుంటే భట్టి విక్రమార్క కమల్ రాజు ఎందుకు సాగర్ నీటిని తీసుకురాలేకపోయారో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు సాగర్ నీటి కోసం ఎన్నోసార్లు రోడ్లెక్కి రాస్తారోకోలు చేశారని ఏనాడైనా మల్లు భట్టి విక్రమార్క కమల్ రాజు రైతుతో కలిసి పోరాటంలో పాల్గొన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వారు మధిర నియోజకవర్గ అభివృద్ధిని తాము చేస్తామంటే, తాము చేస్తామని ప్రజలను మరొకసారి మోసం చేయడానికి వస్తున్నారని, ఇటువంటి బూర్జువా, పెట్టుబడి దారి మనస్తత్వం కలిగిన వారిని ఓడించి ప్రజా మనస్తత్వం కలిగిన పాలడుగు భాస్కర్ ను గెలిపించాలని కోరారు. బోనకల్ లో ప్రారంభమైన మోటార్ సైకిల్ ర్యాలీ రావినూతల, పెద్దబీరవల్లి, జానకిపురం, నారాయణపురం, చిన్న బీరవల్లి, రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట, రాయన్నపేట, మోటమర్రి, ఆళ్ళపాడు మీదుగా బోనకల్లు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మండల కమిటీ సభ్యులు తుళ్లూరు రమేష్, కిలారు సురేష్, నోముల పుల్లయ్య, గుగులోతు పంతు, చిట్టుమోదు నాగేశ్వరరావు, నిమ్మల రామారావు, కొమ్మినేని నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం, ఏడు నూతల లక్ష్మణరావు, కళ్యాణపు శ్రీనివాసరావు వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు, ప్రజాసంఘాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.