కార్మిక వర్గానికి ప్రమాద ఘంటికలు
‘మోడీ సర్కారు తీసుకొస్తున్న కొత్త కేంద్ర కార్మిక విధానం శ్రమ శక్తి నీతి 2025తో మొత్తం కార్మిక వర్గానికి ప్రమాద ఘంటికలు మోగనున్నాయి. ఈ విధానం కార్మికులకు అత్యంత ప్రమాదంగా, అప్రజాస్వామికంగా ఉన్నది. మనుస్మృతి ప్రేరణతో తీసుకొస్తున్నామంటూ చెబుతూ రాజ్యాంగ విలువలకు వలవలూడదీస్తున్నది. కార్మిక సంఘాలతో చర్చించకుండా కార్మిక ప్రయోజనాలను కాపాడుతున్నామనే పేరుతో వారి మెడకు ఉరి తాడు పేనుతున్నది. పోరాడి సాధించుకున్న చట్టాలకు తిలోదకాలిస్తున్నది. కార్పొరేట్ల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం విధానాలను రూపొందిస్తున్నది’ అని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన ‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమ శక్తి నీతి 2025 కార్మిక వర్గంపై దాడి’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. తపన్సేన్తో పాటు సీఐటీయూ జాతీయ కార్యదర్శి కె ఉమేశ్, కోశాధికారి ఎం సాయిబాబు, సీనియర్ నాయకులు ఆర్ సుధాభాస్కర్ మాట్లాడారు.
తపన్‌సేన్ మాట్లాడుతూ పెట్టుబడి దారి వ్యవస్థ తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు కార్పొరేట్లు తమ లాభాలను మరింత ఎక్కువగా పిండుకోవాలని చూస్తారన్నారు. అందుకనుగుణంగా బీజేపీ ప్రభుత్వం శ్రమ శక్తి నీతి 2025 పేరుతో కేంద్ర కార్మిక కొత్త విధానాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టిందని తెలిపారు. దేశంలో ఉత్పాదనలో కీలక పాత్ర నిర్వహిస్తున్న కోట్లాది మంది కార్మికులకు సంబంధించిన విధానాన్ని రూపొందించే క్రమంలో కార్మిక సంఘాలతో కనీసం సంప్రదింపులు చేయకపోవటం అప్రజాస్వామిక చర్యకాక మరేమిటని ప్రశ్నించారు.
2019-20లో 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకు రావటంతో పాటు శ్రమశక్తినీతి 2025 తీసుకురావటం అనేది నయా ఉదారవాద విధానాల్లో భాగమేనని చెప్పారు. ఆరేండ్లుగా లేబర్ కోడ్లును నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయని గుర్తు చేశారు. రద్దు చేయకపోగా బీజేపీయేతర ప్రభుత్వాలతో పాటు తమ ప్రభుత్వాల్లో వాటిని తక్షణమే అమలు కోసం విధానాల రూపకల్పన చేయాలని ఒత్తిడి చేస్తున్నదని తెలిపారు 8గంటల పని విధానాన్ని మార్చి, 10,12గంటలకు సవరిస్తున్నారని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం ఈ పద్దతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. కేంద్రం తెస్తున్న కొత్త విధానం ద్వారా రాజ్యాంగంలోని సమానత్వం, సామాజిక న్యాయం, శ్రమకు గౌరవం లాంటి అంశాల ప్రాతిపదికన దాన్ని రూపొందిస్తున్నట్టు ప్రజలను మభ్యపెట్టటం సరికాదని హితవు పలికారు. మనుస్మృతి ప్రేరణతోనే కొత్త కార్మిక విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది బీజేపీ ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యకు నిదర్శనమని తెలిపారు. నయా ఉ దారవాద విధానాల అమలు కాలంలో కార్మికులు సృష్టిస్తున్న సంపదలో వేతనాలు నిష్పత్తి పడిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క లాభాల నిష్పత్తి అపరిమితంగా పెరుగుతున్నదని తెలిపారు. 1981-82 వేతనాల వాట 30.27శాతం నుంచి 2023-24 నాటికి 15.97శాతానికి పడిపోయాయని పేర్కొన్నారు. అదే కాలంలో లాభాల వాటా 23,30శాతం నుంచి 51 శాతానికి పెరిగాయని తెలిపారు. కార్మికుల శ్రమను కార్పొరేట్లు కొల్లగొడుతున్న తీరుకు ఇది అద్దం పడుతున్నదని చెప్పారు. ఈ కార్మిక విధానంలో దేశంలో మొత్తం కార్మికులను సమ్మిళితం చేస్తామనీ, వారికి సంక్షేమం కల్పిస్తామని గొప్పలు చెబితే సరిపోదన్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యూటీ, బోనస్ తదితర ప్రయోజనాలు పొందేందుకు కార్మికుల సంఖ్యను నిబంధనగా పెట్టటం సరికాదన్నారు. కేంద్ర కార్మిక శాఖ పార్లమెంట్‌కు సమర్పించిన గణాంకాల ఆధారంగా ఐదు వేల పరిశ్రమల్లో యాక్సిడెంట్లు జరిగాయన్నారు. 60శాతం శ్రామిక మహిళలకు మెటర్నటీ చట్టం అమలు జరగలేదని తెలిపారు. ఐటీ ఐటీఈఎస్ పరిశ్రమల్లో రెండేండ్లలో మూడున్నర లక్షల మందిని తొలగించారన్నారు. ఈపీఎఫ్‌ను సరిగా అమలు చేయకపోవటంతో 35వేల కేసులు పెండింగ్‌లో ఉ న్నాయన్నారు. పని ప్రదేశాల్లో 40శాతం శ్రామిక మహిళలపై వేదింపులు, లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 70శాతం నిర్మాణ రంగ కార్మికులకు చట్టాలు అమలు చేయటం లేదనీ, 65శాతం రవాణా రంగ కార్మికులకు నిర్దిష్ట పనిగంటలు లేకుండా 12,15గంటలు పనిచేయిస్తున్నారని తెలిపారు. దేశంలో ఇంత నగ్నంగా కార్మిక చట్టాలను ఉల్లంఘన జరుగుతుంటే వీటిని నియంత్రించి తగిన తనిఖీలు చేసి, కార్మికుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం దీన్ని విస్మరిస్తున్నదని విమర్శించారు.
సీఐటీయూ జాతీయ కార్యదర్శి కె ఉమేశ్ మాట్లాడుతూ కేంద్రం చెప్పే కొత్త కార్మిక విధానం, నాలుగు లేబర్కోడ్ల అమలు చేసి, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే కుట్ర ఉన్నదని విమర్శించారు. మనుధర్మ శాస్త్రంలాంటి సిద్ధాంతాన్ని జోడించి కార్మిక వర్గాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. పదేండ్ల కాలంలో రిజిష్టరయిన పరిశ్రమల సంఖ్య తగ్గిందన్నారు. పది, పదేహేనేండ్లుగా కనీస వేతనాల సవరణ జరగలేదని చెప్పారు. ద్వైపాక్షిక కమిటీల సమావేశాలను 2015 నుంచి జరపటం లేదన్నారు.
ఎం సాయిబాబు మాట్లాడుతూ పెట్టుబడి దారి విధానానికి కార్మిక వర్గం బలిపశు వులు కాబోతున్నారని తెలిపారు. లాభాల శాతం పెరగటం, వేతనాల శాతం పెరగటమంటే దోపిడీ పెరగటమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కనీస పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా అమలు చేయటం లేదని విమర్శించారు. ఐఎల్డీను సమావేశ పర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నదని చెప్పారు. కేరళ ప్రభుత్వ తరహాలో తెలంగాణ, ఆంద్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు.
చుక్క రాములు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడి తీవ్రతరం చేసిందన్నారు. ప్రయివేటు పెట్టుబడి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని ఊదరగొడుతున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి జె వెంకటేశ్ పాల్గొన్నారు.