కుమ్మేర ఘటనపై తీవ్ర ఆగ్రహం
నిందితులను వెంటనే అరెస్టు చేయాలి–భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు దుగ్యాల స్వామి రేగొండ మండలంలో జరిగిన కుమ్మేర మల్లన్న జాతర సందర్భంగా రెండు నెలల పసి శిశువు మరణానికి దారితీసిన ఘటనపై తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రేగొండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు దుగ్యాల స్వామి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సామాజిక సమానత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. కులవివక్ష భావాలు ప్రాణనష్టానికి దారితీయడం బాధాకరమని తెలిపారు.అమాయక శిశువు మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని,సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సంఘం హెచ్చరించింది. బాధిత కుటుంబానికి తగిన పరిరక్షణ, ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్‌ను కూడా ఉంచింది.సమాజంలో సామరస్య వాతావరణం నెలకొల్పడం ప్రభుత్వ బాధ్యత అని, అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులతో జీవించేలా చర్యలు తీసుకోవాలని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ ఘటన పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణ జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.