కొత్తపల్లి గోరి నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు
Uncategorized
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
సోమవారం గోరి కొత్తపల్లి మండలంలో నూతనంగా నిర్మితమైన పోలీస్ స్టేషన్ను భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు సభలో మంత్రులు మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు గోరి కొత్తపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇది స్థానిక ప్రజలకు రక్షణకు భాసటగా నిలుస్తుందని తెలిపారు. అంతకుముందు మంత్రులు
పీఎస్ నూతన భవనంలో నూతన ఎస్సై దివ్యను, కుర్చీలో కూర్చోబెట్టి, అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ
సోమవారం నుంచి కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ప్రజలు ఏ సమస్య ఉన్న పోలీసులను ఆశ్రయించి, తమ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, కాకాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, జిల్లా అధికార యంత్రాంగం, వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.