క్రీస్తు సందేశం విలువలతో కూడిన బలమైన సమాజ నిర్మాణానికి పునాది
ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, దయ, సేవ వంటి విలువలు సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పి బలమైన మరియు ఐక్యమైన సమాజాన్ని నిర్మించేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్, సుభాష్ కాలనీ, కాకతీయ కాలనీ, కాశీంపల్లి, సీఆర్ నగర్, బాంబులగడ్డ, శాంతినగర్ ప్రాంతాల్లోని చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,క్రిస్మస్ పండుగ మతాతీతంగా ప్రజలను ఏకం చేస్తూ, మానవ సంబంధాలను బలోపేతం చేసి, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.క్రీస్తు సందేశం బలమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని,ప్రేమ మరియు శాంతి అనే యేసుక్రీస్తు బోధనలు ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచి, సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతాయని తెలిపారు.అలాగే,ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, దయ, సేవ వంటి క్రైస్తవ విలువలు సమాజానికి పునాదిలా నిలుస్తాయని వాటిని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేస్తే సమాజం మరింత ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో వివిధ చర్చిల పాస్టర్లు, సంఘ నాయకులు, క్రైస్తవ సోదర సోదరీమణులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.