
గిరిజన, సంక్షేమ శాఖ డైలీవేజ్ పిఎంహెచ్ వర్కర్ల సమ్మె
తక్షణం చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలి.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.విద్యార్థి ఉపాధ్యాయు గిరిజన సంఘాల సంఘాల డిమాండ్. వేతనాల తగ్గింపును నిరసిస్తూ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని మరియు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2025 సెప్టెంబర్ 12 నుండి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని డైలీవేజ్ పిఎంహెచ్ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో జోక్యం చేసుకోవాలని తక్షణమే సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థి, ఉపాధ్యాయ, గిరిజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను డిమాండ్ చేసింది. అక్టోబర్ 10న హైదరాబాద్‌లోని సిఐటియు కార్యాలయంలో డైలీవేజ్, పిఎంహెచ్ వర్కర్ల నిరవధిక సమ్మెకు మద్దతుగా జేఏసీ నాయకులు మాడే పాపారావు అధ్యక్షతన విద్యార్థి, ఉపాధ్యాయ, గిరిజన, కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్, మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ నాయక్, నాయకులు, తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. వెంకటేష్‌లు మాట్లాడుతూ నెల రోజులుగా గిరిజన సంక్షేమ శాఖలో 3,000 మంది డైలీ పిఎంహెచ్ వర్కర్లు సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించడంలో, కనీసం వారితో చర్చలు కూడా జరపకుండా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు పిఎంహెచ్ల నిర్వహణలో గత 35 సంవత్సరాలుగా డైలీవేజ్, పిఎంహెచ్ వర్కర్ల పాత్ర గణనీయంగా ఉందని, వారు పని చేయడం ఫలితంగానే వాటి నిర్వహణ సాధ్యమవుతుందని, వారు లేకపోతే నిర్వహణ సాధ్యం కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంచిక అనుగుణంగా నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులను శాంక్షన్ చేయకుండా, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించని ఫలితంగా డైలీవేజ్, కంటన్జెంట్ వర్కర్లతో గత 35 సంవత్సరాలుగా పని చేయించుకుంటున్నారని అన్నారు. కానీ వీరి సమస్యను పరిష్కరించడంలో గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఫలితంగానే ఈరోజు అనివార్యంగా కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. ఒకే శాఖలో ద్వంద విధానాలను అమలు చేస్తూ, ఒకే దగ్గర టైం స్కేల్‌ని అమలు చేస్తూ, మరో దగ్గర అమలు చేయకపోవడం సరికాదన్నారు. గత 30 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ల గెజిట్ల ప్రకారం పొందుతున్న వేతనాలను 2021లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ.64 పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వేతనాలను తగ్గించడం సరికాదన్నారు. రూ.26,000/
ల వేతనాన్ని రూ.11,700/`లకు తగ్గించటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్న్రించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు వేతనాలు పెంచాల్సింది పోయి ఉన్న వేతనాలను తగ్గించి వారి పొట్టలుకొట్టడం అన్యాయమని అన్నారు.
గత 35 సంవత్సరాలుగా వారు పని చేస్తుంటే, వారెవరో తమకు తెలియదని, వారి పేర్లు తమ వద్ద లేవని ఆర్థిక శాఖ అధికారులు వితండవాద చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. వీరి సమస్యలపై 2008, 2010లో నాటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిపి వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని, దీని కనుగుణంగా కొత్త పోస్టులను శాంక్షన్ చేయాలని తీర్మానించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన అనంతరం వీరిని పర్మినెంట్ చేస్తారని ఆశపడితే జీఓ నెం.16లో డైలీవేజ్ అనే పదం లేదనే పేరుతో వీరు పర్మినెంట్ కాకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ అధికారుల వ్యవహారశైలి వర్కర్లను పెనం మీద నుండి పొయ్యిలో వేసినట్లుగా వున్నదని అన్నారు. పర్మినెంట్ చేయాలని, టైం స్కేల్ ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తుంటే అది చేయకపోగా ఉన్న జీతాలను తగ్గించి వారందరినీ ఔట్సోర్సింగ్లోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఫలితంగా గిరిజన కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యం, అసంబద్ధమైన విధానాల ఫలితంగానే నేడు గిరిజన సంక్షేమ శాఖలో డైలీవేజ్ పిఎంహెచ్ వర్కర్లు వీధిన పడ్డారని అన్నారు. టైం స్కేల్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని వారు తెలియజేశారు.
కార్మికుల సమ్మె ఫలితంగా 1,34,000 మంది గిరిజన విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని, ఆశ్రమ పాఠశాలు, హాస్టల్స్ యొక్క నిర్వహణలో అనేక ఆటంకాలు వస్తున్నాయని, చదువుకోవాల్సిన విద్యార్థులు వంటపని చేయాల్సి వస్తుందని, ఫలితంగా వారి చదువులు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ గురించి మాటలు చెబుతూనే మరోపక్క గిరిజన కార్మికుల, విద్యార్థుల సంక్షేమం గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. తక్షణం గిరిజన శాఖామంత్రి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలని, సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులకు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గిరిజన సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డైలీవేజ్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న తదితరులు పాల్గొన్నారు.