గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించి గ్రామాభివృద్ధికి కలిసి పనిచేయాలి
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచులు,ఉప సర్పంచ్లు, వార్డ్ సభ్యులకు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదాలతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తమ బాధ్యతను గుర్తించి గ్రామాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శక పాలన అందించాలని ఆకాంక్షించారు.అలాగే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు.గెలుపు–ఓటములు రాజకీయాల్లో సహజమని పేర్కొన్న ఆయన,“అస్తమించిన సూర్యుడు మళ్లీ ఉదయించడం ఎంత నిజమో, పోరాటంలో ఓడిన వీరుడు తిరిగి విజయం సాధించడం కూడా అంతే నిజం” అని వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో వారికీ తప్పకుండా విజయం వరించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.మనమంతా ఒకే ఊరి వారమని, ఎన్నికల సమయంలో ఏర్పడిన కోపతాపాలు, రాగద్వేషాలను పక్కన పెట్టి నూతనంగా గెలిచిన సర్పంచ్ నాయకత్వంలో గ్రామాభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమిష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని అయిలి మారుతి కోరారు.