
చిల్పూర్, మార్చి 06
ఈ నెల 13న జరగనున్న గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) జిల్లా మహాసభను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం చిల్పూర్ మండల కేంద్రంలో సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు డోకి శ్రీనివాస్ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి సంఘం జనగామ జిల్లా కార్యదర్శి సాదం రమేష్ హాజరై మాట్లాడుతూ జిల్లాలో గొల్లకురుమల కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయంగా, ఆర్థికంగా వారికి సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో గొల్లకురుమల ఓట్లు కోసం నాయకులు హామీలు ఇచ్చి తర్వాత వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. గొర్రెలు మేకలు మేపేందుకు భూములు లేకపోవడం, మార్కెట్లలో దళారుల చేత మోసపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.ప్రతి మండల కేంద్రంలో కేజీల లెక్కన గొర్రెలు అమ్ముకునే విధంగా ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని, గొర్రెల కాపరులకు రక్షణ చట్టం తీసుకురావాలని, ప్రతి గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన కాపరులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని కోరారు.పశువైద్యశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి, మూగజీవులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.ఈ డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నెల 10, 11 తేదీల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాను జనగామ జిల్లా గొల్లకురుమలు, గొర్రెల కాపరులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆవుల లింగయ్య, గుంటి రాజా కొమురయ్య, డోకి సమ్మయ్య, సూర్నా లచ్చయ్య, సుంక రవి, బుర్ర రవికుమార్, గుంటి మల్లయ్య, బండారి రవి తదితరులు పాల్గొన్నారు.