గ్రామీణ పేద కూలీల మెడలకు వేలాడనున్న ఉరితాళ్లు
దేశ చరిత్ర పుటల్లో మహాత్ముని పేరు తొలగింపుకు కుట్ర..
ఆనాటి యూపిఏ గవర్నమెంట్ లో సిపిఎం,వామపక్షాల ఎంపీల ఒత్తిడి వల్లే
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి..
నూతన చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం పై రూ. 4 వేల కోట్ల అదనపు భారం..
కూటమి ప్రభుత్వం, వైసిపి మౌనం వీడి ప్రజా ఉద్యమానికి కలిసి రావాలి..
మోదీ సర్కార్ తీరు నిరసిస్తూ ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు…
నూతన చట్టం రద్దు చేసే వరకు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం కొనసాగింపు..
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు..
కేంద్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్ నూతనంగా తీసుకొచ్చిన విబి- జిఆర్ఎ ఎం జి బిల్లు పై ప్రతిపక్షాలతో పాటు రైతు, ప్రజా సంఘాల నుంచి అగ్రహాజ్వాలలు మిన్నంటుతున్నాయి. కరువు ప్రాంతాలలో సైతం గ్రామీణ కూలీలకు ప్రయోజనకరం గా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తూ దాని స్థానంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన విబి- జిఆర్ ఎ ఎం జి బిల్లు ను వ్యతిరేకిస్తూ సిపిఎం అగ్ర నేతలు శుక్రవారం దేశవ్యాప్తంగా మౌన దీక్ష కార్యక్రమాలకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు సిపిఎం నగర శాఖ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి మౌన దీక్ష తో కేంద్రానికి నిరసన తెలియ చేశారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ గవర్నమెంట్ నిరంకుశత్వ పోకడలు పోతుందని ధ్వజమెత్తారు. మోడీ తనకు తాను నియంతలా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. దేశ జాతిపితగా మహాత్మా గాంధీ ప్రపంచానికే మార్గదర్శింగా నిలిచారని గుర్తు చేశారు. అటువంటి మహనీయుని పేరిట గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పథకం కల్పిస్తూ ఏర్పాటు చేసిన చట్టాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ రద్దు చేయడానికి తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. ఆనాటి యూపీఏ గవర్నమెంట్ లో సిపిఎం,వామపక్షాలు 62 మంది ఎంపీ కలిగిన సిపిఎం పార్టీ ఒత్తిడి వల్లే గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించే నిమిత్తం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. మతోన్మాద శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిన మోడీ సర్కార్ కుట్రలో భాగంగానే మహాత్ముని పేరు తొలగింపు కు పన్నాగం పన్నిందని మండిపడ్డారు. మోదీ సర్కార్ గాడ్సేన్ నెత్తిన పెట్టుకొని గాంధీజీని చరిత్ర పుటల్లో నుంచి తొలగించాలని కుట్ర పన్నుతుందని పేర్కొన్నారు.
కేంద్రం విధానం దేశ చరిత్రను తిరగరాసే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.
బుధవారం అర్ధరాత్రి వరకు పార్లమెంటులో విబి- జి ఆర్ ఎ ఎం జి బిల్లు పై చర్చ జరగగా సమయం మించిపోవటంతో మరుసటి రోజు గురువారం నాడు ఆగ మేఘాల మీద బిల్లును ఆమోదించి నూతన చట్టాన్ని తీసుకువచ్చారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా గ్రామీణ కూలీలకు వంద రోజుల ఉపాధి కలుగుతుందని ఈ నూతన చట్టం అమల్లోకి రావడంతో వారి మెడలకు ఉరితాళ్లుగా మారనున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ భూస్వామ్య, పెత్తందారులకు వత్తాసు పలికేందుకే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.. తను అధికారంలోకొస్తే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న మోడీ తీరా అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవు అన్నారు. పాత పథకం కింద కేంద్రం 90% భరిస్తే రాష్ట్రాలు పది శాతం భరించేవని పేర్కొన్నారు. కానీ నూతన చట్టం ప్రభావం రాష్ట్రాలపై 40% పడనుందన్నారు. ఇక రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందంటూ పదేపదే పేర్కొంటున్న కూటమి నేతలు నూతన చట్టం పై నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అన్నారు. నూతన చట్టం రాకతో రాష్ట్ర ప్రభుత్వం పై నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని స్పష్టం చేశారు. మోదీ కాళ్ల దగ్గర ఊడిగం చేయటం మానుకొని రోడ్ల మీదకు రావాలంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు జగన్ కు హితవు పలికారు. లేనిపక్షంలో గ్రామీణ ప్రాంత ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బిజెపి చర్యలకు వ్యతిరేకంగా నూతన చట్టాన్ని నిరసిస్తూ ఈనెల 20న ప్రజా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయని ఇదే బాటలో 22వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు. ప్రజా ఉద్యమంలో టిడిపి,వైసిపి,జనసేన భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ గవర్నమెంట్ గ్రామీణ ప్రాంత రైతు కూలీల నోట్లో మట్టి కొట్టిందన్నారు. తమ పార్టీ ఎంపీల ఒత్తిడి తోనే ఆనాటి యూపీఏ గవర్నమెంట్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. కానీ నేటి ఎన్డీఏ గవర్నమెంట్ మహాత్ముని ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ ఆ మహనీయుని పేరిట ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈ నూతన చట్టం పై కూటమి నేతలు నోరు మెదపకపోవడం చూస్తుంటే వీరు మూగజీవాలుగా మారారా అనిపిస్తుంది అన్నారు. బాబు, పవన్, జగన్ మోడీ అడుగులకు మడుగులు ఎత్తటం మాని గ్రామీణ పేద కూలీలకు ఉపాధి కల్పించే పాత చట్టాన్ని పునరుద్ధరించేలా తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలా జరగని పక్షంలో రాష్ట్రంలోని గ్రామీణ రైతు కూలీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్య బాబు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా గ్రామీణ రైతు కూలీలకు ఆర్థిక భరోసానిచ్చిందని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాలన సాగిస్తున్న మోడీ సర్కార్ గాడ్సే కు అనుకూలంగా గాంధీజీకి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. మోదీ సర్కార్ తీరు మారని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, సెంట్రల్ నగర కార్యదర్శి బి. రమణ
పి.కృష్ణ తూర్పు నగర కార్యదర్శి పి. కృష్ణ,
కె.దుర్గారావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.దుర్గారావు, పశ్చిమ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ వి నారాయణ,పశ్చిమ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సూరిబాబు,
బి.చిన్నారావు, తూర్పు నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి చిన్నారావు, రమణ సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.