గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిరంతర కృషి
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలి
గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం
గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం అన్నారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి గ్రామానికి వచ్చే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు, కొమ్మలు, ముళ్ళపొదలను జేసిబితో తొలగించడంతో పాటు గ్రామంలో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టి పిచ్చి మొక్కలు, సైడ్ కాలువలోని మట్టిని తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌతం మాట్లాడుతూ ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలిపారు. గ్రామంలో తాగునీటి, వీధిలైట్లు, మురికి కాలువల శుభ్రత తదితర వంటి అంశాలపై మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.చెత్తాచెదరాన్ని రోడ్లపై వేయవద్దని,వృథాగా నీటిని రోడ్డుపై వదలకూడదని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొట్టి శ్రీను, పాక భిక్షం, శరత్, నరేష్, వెంకన్న, ఉప సర్పంచ్ వినోద్, కరుణాకర్, యాదగిరి, సోమయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.