ఘనంగా సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ సద్గురు సేవాలాల్ మహరాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక దారిదీపమని, ఆయన బోధనలు సమాజంలో నైతిక విలువలు, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించడానికి మార్గదర్శకమని తెలిపారు. సమానత్వం, సోదరభావం, క్రమశిక్షణ వంటి విలువలను ఆయన జీవితాంతం ఆచరించి చూపారని పేర్కొన్నారు. యువత ఆయన ఆదర్శాలను అనుసరించి విద్యా, ఉపాధి రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన మరియు బంజారా సమాజ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్, ఆర్డీఓ హరికృష్ణతో పాటు ప్రజాప్రతినిధులు, బంజారా సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవాలాల్ మహరాజ్ బోధనలపై ప్రసంగాలతో వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా బంజారా సమాజ ఐక్యతను ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.