
సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఘన్పూర్ పట్టణ కేంద్రంలో సీఐటీయూ
ఈ69న్యూస్ స్టేషన్ ఘన్పూర్,జూలై 9:బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఘన్పూర్ పట్టణ కేంద్రంలో సీఐటీయూ,ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.స్థానికంగా జరిగిన ఈ ర్యాలీలో కార్మికులు,ప్రజాప్రతినిధులు,సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..కార్మికులు సంవత్సరాలుగా పోరాడి సంపాదించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కొత్త కోడ్ల పేరిట కాలరాస్తోందని తీవ్రంగా విమర్శించారు.లేబర్ కోడ్లు కార్మికులకు బానిసత్వాన్ని మిగిల్చే చట్టాలు గా అభివర్ణించారు.సమాన పనికి సమాన వేతనం,కనీస వేతనం రూ.26,000,కాంట్రాక్టు కార్మికులకు రక్షణ,ఉద్యోగ భద్రత,మహిళా కార్మికులకు ప్రత్యేక చట్టాలు వంటి డిమాండ్లను వారు ప్రస్తావించారు.కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు.కార్మిక హక్కుల కోసం ఈ పోరాటం మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.