
ఈ69 న్యూస్ జనగామ
జనగామ పట్టణంలోని ప్రధాన బ్రిడ్జి చీకటిలో మునిగి ఉండడంతో ప్రయాణికులు,స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడడంతో,సిపిఎం పార్టీ జనగామ పట్టణ కమిటీ గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.సిపిఎం నాయకులు,కార్యకర్తలు పలుమార్లు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి,సమస్యను పరిష్కరించాలని పట్టుబట్టారు.“ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి నిర్లక్ష్యం చేయరాదు”అని నినదించారు.నిరంతరంగా పోరాటం కొనసాగించడంతో ఈ సమస్య జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ స్వయంగా ఈ అంశంపై స్పందించి,వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకి లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అధికారులు వేగంగా చర్యలు తీసుకోవడంతో బ్రిడ్జి పై లైట్లు అమర్చి,రాత్రివేళల్లో తెల్లటి వెలుగులతో మెరిసిపోతూ ప్రజలకు సౌకర్యాన్ని అందిస్తోంది.లైట్లు వెలిగిన వెంటనే స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.“ఇప్పటి వరకు చీకట్లో ప్రయాణం భయానకంగా ఉండేది.ఇప్పుడు ఆందోళన లేకుండా వెళ్ళగలుగుతున్నాం”అని పలువురు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.సిపిఎం జిల్లా నాయకులు ఈ విజయాన్ని ప్రజా ఉద్యమ శక్తికి నిదర్శనంగా అభివర్ణించారు.“మా పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై కట్టుదిట్టంగా పోరాడుతుంది.ఈ రోజు వెలుగులు ప్రజలకు అందినట్లే,రేపు మరిన్ని సమస్యల పరిష్కారం కోసం మా పోరాటం కొనసాగుతుంది”అని పేర్కొన్నారు.