జనగామ ఏరియా హాస్పిటల్లో దారుణం
జనగామ జిల్లా ఏరియా హాస్పిటల్లో శనివారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది.లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన దుర్గి పూలమ్మ అనే మహిళ తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో ఆమెను సిపిఎం మండల కార్యదర్శి బొడ్డు కరుణాకర్,ఇతర మిత్రులతో కలిసి ఆసుపత్రికి తీసుకొచ్చారు.ఆసుపత్రిలో ట్రాలీ బాయ్ అందుబాటులో లేకపోవడంతో పూలమ్మను వారు స్వయంగా స్ట్రెచర్‌పై ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువెళ్లారు.అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ స్నేహిత్,పేషెంట్‌ను అడ్మిట్ చేయమని అడిగిన సందర్భంలో తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా,మెడికల్ ఎమర్జెన్సీ కిట్ ట్రేలో ఉన్న బాటిల్‌తో కరుణాకర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.వెంటనే సమాచారం అందుకున్న సిపిఎం నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.సిపిఎం డిమాండ్
జనగామ జిల్లా కమిటీ ఈ సంఘటనను ఖండిస్తూ,సంబంధిత డాక్టర్‌ను తక్షణమే విధుల నుండి తొలగించాలని,ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఇతర సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.