జిల్లాలో పర్యటించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ,ఆరోగ్యం, విద్యా ప్రమాణాలపై ప్రత్యక్షంగా పరిశీలన చేయడానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు బోర్ర వచన్ కుమార్ జిల్లా పర్యటన చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.పర్యటనలో భాగంగా ఆయన మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల,అంగన్వాడి కేంద్రం, మైనార్టీ బాలుర పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రి, సింగరేణి ఏరియా ఆసుపత్రి, అలాగే కాటారం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ను సందర్శించారు. విద్యాసంస్థలు మరియు సంక్షేమ కేంద్రాల్లో బాలల కోసం అమలవుతున్న పథకాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ ప్రతి శాఖ ప్రాధాన్య బాధ్యతగా భావించి కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఆరోగ్యం, విద్య, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నవ సమాజ నిర్మాణానికి పునాది వేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ ఆసుపత్రిలో బాల రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. మైనార్టీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నియమిత హెల్త్ చెకప్ నిర్వహించాలని విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు.అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి బాలుడికి సమృద్ధిగా పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని సిడిపిఓ,సూపర్వైజర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అనిల్ చంద్రరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మధుసూదన్, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటరత్నం, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిరా, వెటర్నరీ డాక్టర్ కుమారస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి మరియు సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.జిల్లాలో బాలల సంక్షేమానికి సంబంధించిన సేవలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు