జిల్లాలో రెగ్యులర్ డీఈఓ,ఎంఈఓలను వెంటనే నియమించాలి
ఇన్ఛార్జ్ పాలనతో గాడితప్పిన విద్యావ్యవస్థ:ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్
జిల్లా రెవెన్యూ అధికారి (డి ఆర్ ఓ) కి వినతిపత్రం సమర్పణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యాశాఖ అంతా ఇన్ఛార్జ్ల పాలనలోనే కొట్టుమిట్టాడుతోందని,దీనివల్ల జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాకు రెగ్యులర్ డీఈఓ ని,అలాగే అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓ లను తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి కి పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
తొమ్మిదేళ్లుగా ఇన్ఛార్జ్ల రాజ్యమేనా..?
అనంతరం నాగుల అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడి 9 ఏళ్లు దాటుతున్నా, ఇంతవరకు కేవలం ఒక్కరంటే ఒక్కరే రెగ్యులర్ డీఈఓగా పనిచేశారని, ఆ తర్వాత అంతా ఇన్ఛార్జ్లతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. డీఈఓ లాంటి కీలక పోస్టే ఇన్ఛార్జ్ పరిధిలో ఉంటే జిల్లాలో విద్యావ్యవస్థ ఎలా మెరుగుపడుతుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడం దారుణమన్నారు.పాఠశాలల్లో పనిచేసే సీనియర్ ఉపాధ్యాయులకే ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. అటు స్కూళ్లలో పాఠాలు చెప్పలేక, ఇటు మండల విద్యాశాఖను పర్యవేక్షించలేక రెండు వైపులా న్యాయం చేయలేకపోతున్నారని,ఫలితంగా విద్యావ్యవస్థ విచ్ఛిన్నమవుతోందని ఆరోపించారు.అధికారుల పూర్తిస్థాయి పర్యవేక్షణ లోపించడంతో ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కనీస అర్హతల్లేని ఉపాధ్యాయులతో బోధన సాగిస్తూ, మౌలిక వసతులు లేకున్నా యథేచ్ఛగా నడుపుతున్నాయని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత తగ్గిపోతోందని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, మౌలిక వసతుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రెగ్యులర్ డీఈఓను, అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలని, లేనిపక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్, పట్టణ నాయకులు అజయ్,పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.