జిల్లా విద్యాశాఖ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై ప్రత్యేక సమీక్ష జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్ కుమార్,హైదరాబాద్ రాష్ట్ర విద్యా శిక్షణ సంస్థ సంయుక్త సంచాలకురాలు ఎస్.విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధుల వినియోగంపై విస్తృత సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన ఆపార్ (అకాడమిక్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అండ్ రికార్డ్),ఎంబీయూ (మానిటరింగ్ బేస్డ్ యూనిట్),ప్రాథమిక సాక్షరత సంఖ్యా నైపుణ్యాలు,డిజిటల్ విద్యా కార్యక్రమాలు,పాఠశాలల భౌతిక వసతులు,విద్యుత్ సదుపాయాలు,భవన నిర్మాణ పనులు వంటి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో మాట్లాడుతూ..అదనపు కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్ కుమార్,గత నెలతో పోలిస్తే జిల్లా విద్యాశాఖలో మెరుగైన పురోగతి కనిపిస్తోందని తెలిపారు.అయితే ఇంకా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఫిబ్రవరి నెలలో ప్రాథమిక అభ్యాస సర్వే,మార్చి నెలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఇవి అత్యంత కీలకమని పేర్కొని,సంబంధిత అన్ని పనులను జనవరి నెలలోనే పూర్తిచేయాలని సూచించారు.అలాగే ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పరిశీలకురాలు ఎస్.విజయలక్ష్మి మాట్లాడుతూ..జిల్లా విద్యాశాఖ పనితీరు ప్రశంసనీయంగా ఉందని,విద్యా కార్యక్రమాల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని అన్నారు.ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ప్రిన్సిపాళ్లు తమ బిల్లులకు సంబంధించిన నివేదికలను సమర్పించి తమ సందేహాలకు నివృత్తి పొందారు.ఈ కార్యక్రమంలో అదనపు సంచాలకుడు సత్యనారాయణ మూర్తి,రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలు అర్జున్,రాష్ట్ర నాణ్యత సమన్వయకర్త శ్రీనాథ్,రాష్ట్ర ప్రధానమంత్రి పోషణ పథకం,జిల్లా స్థాయి సమన్వయకర్తలు,మండల విద్యా అధికారులు తదితరులు పాల్గొన్నారు.