జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
క్రీ.శే. శ్రీ గన్ రెడ్డి తిరుపతిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుల ఆధ్వర్యంలో రేగొండ మండలంలో జిల్లా స్థాయి ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం ఉత్సాహభరితంగా నిర్వహించబడింది.గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం,ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ పోటీలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల జట్లు పాల్గొని రసవత్తర పోటీలు ప్రదర్శించాయి.ఈ టోర్నమెంట్లో రామకృష్ణాపూర్, ఘనపూర్, నైన్ పాక, వేములపల్లి, కనిపర్తి, మర్రిపెల్లిగూడెం, చిట్యాల (ఎల్ఐసీ టీమ్) జట్లు పాల్గొన్నాయి.ప్రారంభ మ్యాచ్‌ల నుంచే ఆటగాళ్లు ఉత్కంఠభరిత ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను అలరించారు.సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రీడాభిమానుల కేరింతల మధ్య సాగాయి.తీవ్రమైన పోటీలో గణపురం జట్టు అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచి ప్రథమ స్థానం దక్కించుకుంది. ఆతిథ్య జట్టు రేగొండ ద్వితీయ స్థానం సాధించి తమ సామర్థ్యాన్ని చాటగా, రామకృష్ణాపూర్ జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.విజేతలకు ట్రోఫీలు,షీల్డ్‌లు అందజేసి ఘనంగా సత్కరించారు.పోటీల నిర్వహణలో భాగంగా క్రీడాకారులు,అతిథులకు భోజన సదుపాయాన్ని కల్పించిన గ్రామ వార్డు సభ్యులు అన్నారపు వెంకట్ రెడ్డి, మేకల రాజు ను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. టోర్నమెంట్‌కు షీల్డ్‌లను అందించిన గన్ రెడ్డి సురేందర్ రెడ్డి, వెంకటకృష్ణ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే రేగొండ గ్రామ క్రీడాకారులకు టీ-షర్టులు పంపిణీ చేసిన ఉపసర్పంచ్ ఎల్దండి నరేష్ ని సన్మానించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వం,మానసిక సమతుల్యత, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడం,యువతను సానుకూల దిశగా మలచడం లక్ష్యంగా ఇలాంటి పోటీలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.కార్యక్రమానికి గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై విజేత జట్లను అభినందించారు. స్మారక టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.